Wayanad Lok Sabha Bye Election : కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయనున్న ప్రియాంకా గాంధీ మెజారిటీపై పార్టీ పెద్దలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. సుమారు 7లక్షల మెజారిటీని ప్రియాంక సాధించేలా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని వయనాడ్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి ఏఐసీసీ దిశానిర్దేశం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ తగ్గకుండా చూడాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా వయనాడ్ జిల్లా కాంగ్రెస్ యూనిట్- ఇప్పటికే కార్యాచరణ అమలును మొదలుపెట్టింది. జోరు వర్షాలతో వయనాడ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించినా- కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లోని పార్టీలు ఉపఎన్నిక కోసం ప్రజలతో మమేకమయ్యాయి. ఇప్పటికే వయనాడ్‌లోని ప్రధాన సెంటర్లలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కూడిన కటౌట్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయ పార్టీలు ముందస్తు ప్రచారానికి పూనుకోవడం వల్ల ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది.
7లక్షల మెజారిటీయే టార్గెట్
వయనాడ్ ఉపఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు ఓవీ అప్పచ్చన్ 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదును ప్రారంభించాయని ఆయన వెల్లడించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రారంభమైందన్నారు. ప్రియాంకా గాంధీకి 6లక్షల ఓట్లు వస్తాయని అప్పచ్చన్ తెలిపారు. కానీ, ఆమెకు కనీసం 7లక్షల మెజారిటీ వచ్చేలా చూడాలని ఏఐసీసీ నేతల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయన్నారు. హైకమాండ్ సూచనల మేరకు ప్రియాంకా గాంధీకి భారీ మెజారిటీని సాధించేందుకు వయనాడ్ కాంగ్రెస్ నేతలు తమ బృందాలను సమాయత్తం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశాలు, ఆ తర్వాత బాడీ సమావేశాలు జరుగుతాయన్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఓవీ అప్పచ్చన్ పేర్కొన్నారు.
2019 వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 7,06,367 ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఆయన మెజారిటీ 4,31,770 ఓట్లు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మెజారిటీ కాస్త తగ్గింది. ఈసారి రాహుల్ గాంధీకి 6,47,445 ఓట్లు రాగా, మెజారిటీ 3,64,422 ఓట్లకు చేరింది. రాహుల్ గాంధీ మెజారిటీ తగ్గడంపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని, త్వరలో జరగబోయే వయనాడ్ బైపోల్‌లో ప్రియాంకా గాంధీకి ఏకంగా 7 లక్షల ఓట్ల మెజారిటీని సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక నాయకత్వానికి నిర్దేశించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు 7 లక్షల మెజారిటీని సాధించే దిశగానే కసరత్తు చేస్తున్నాయని వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు ఓవీ అప్పచ్చన్ అంటున్నారు. ప్రత్యర్థి పార్టీల కంటే తామే ముందంజలో ఉన్నామని ఆయన చెబుతున్నారు.