President Speech In Parliament 2024 : నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రసంగించారు. మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు.
'పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు'
ఇటీవల నీట్ యూజీ, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
VIDEO | " i congratulate all the newly-elected members of the 18th lok sabha. you all have come here by winning the trust of country's voters. very few get this opportunity to serve the nation and the people. i have full faith that you would fulfill your duties with a feeling of… pic.twitter.com/5K6ip90rlO
— Press Trust of India (@PTI_News) June 27, 2024
'పదేళ్లలో సుస్థిర అభివృద్ధి'
'ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన భారత ఎన్నికల సంఘానికి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. ప్రజలు నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. ప్రభుత్వం పదేళ్లో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్ముకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ సారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించింది. శుత్రువులకు గట్టిగా బదులిస్తూ జమ్ముకశ్మీర్ ప్రజలు పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు' అని రాష్ట్రపతి అన్నారు.
ప్రజా సంక్షేమం కోసం సంస్కరణలు
రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టం అయ్యిందని, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించనుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని ప్రభుత్వ విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్లు తెలిపారు. అన్నిరంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, హరిత ఇంధనం సాధన దిశగా తమప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి తెలిపారు.
#WATCH | President Droupadi Murmu arrives at the Lok Sabha to address a joint session of both Houses of Parliament.
— ANI (@ANI) June 27, 2024
A Parliament official, carrying Sengol, leads the way. pic.twitter.com/uVVX3ld5o2
ఆరోగ్య రంగంలో అగ్రగామి
సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రపంచవ్యాప్త డిమాండ్ మేరకు భారత్ ఉత్పత్తులు అందిస్తోందన్నారు. ఆరోగ్యరంగంలో భారత్ అగ్రగామిగా ఉందని, వేగంగా పురోగతి సాధిస్తోందన్నారు.చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కోసం పీఎం సమ్మాన్ నిధి ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల విస్తరణ వేగంగా జరుగుతున్న్టుల చెప్పారు. పౌర విమానయాన రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఆయా రాష్ట్రాల మధ్య కనెక్టివిటి పెరిగినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు.
డిజిటల్ ఇండియా
డిజిటల్ ఇండియా సాధనకు తమ ప్రభుత్వం సంకల్పించినట్లు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తెలిపారు. 'బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశారు. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనికదళాల్లో స్థిరమైన సంస్కరణల కారణంగా బలగాలు స్వయం సమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయటం, సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి' అని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వెల్లడించారు.