Pre Wedding Shoot in Operation Theater : ప్రస్తుత కాలంలో వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు తప్పనిసరిగా మారిపోయాయి. చాలా మంది ప్రీవెడ్డింగ్ షూట్ లేకుండా పెళ్లి చేసుకోవడం లేదు. ఇందులో కూడా వెరైటీగా చేయాలని ఆలోచిస్తున్నారు. కొందరు బురదలో కూడా ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. అలానే వెరైటీగా ఆలోచించిన ఓ డాక్టర్, ఏకంగా ఆపరేషన్ థియేటర్లోనే ప్రీవెడ్డింగ్ షూట్ చేశారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల ఆయనపై వేటు పడింది.
ఇదీ జరిగింది
చిత్రదుర్గ జిల్లాలోని భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద వైద్యుడిగా పనిచేస్తున్న ఓ డాక్టర్, ఆపరేషన్ థియేటర్ గదినే ప్రీవెడ్డింగ్ షూట్ కోసం వేదికగా ఉపయోగించుకున్నాడు. వీటి కోసం లైటింగ్, కెమెరా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేముంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా వీడియోలు, ఫొటోలు తీయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
వైద్యుడిని డిస్మిస్ చేసిన ప్రభుత్వం
దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండు రావ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పింది ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమే అని, వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని మంత్రి చెప్పారు. వైద్యులు తమ వృత్తిని మరచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వైద్యులు, ఒప్పంద ఉద్యోగులు, సిబ్బంది తమ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించానని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నడుచుకోవాలని ఆదేశించారు. సామాన్య ప్రజల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని మంత్రి తెలిపారు.
ఆస్పత్రిలో రీల్స్- 38మంది వైద్య విద్యార్థులు సస్పెండ్
గడగ్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రీల్స్ చేసినందుకు 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు అధికారులు. 10 రోజుల పాటు విద్యార్థులను తరగతుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మెడికల్ కాలేజీ డైరెక్టర్ బసవరాజ్ బొమ్మనహళ్లి. అనుచితంగా ప్రవర్తించి రోగులకు ఇబ్బంది కలిగించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బసవరాజ్ తెలిపారు.