Prajwal Revanna Case : మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను శుక్రవారం వేకువజామున బెంగళూరు విమానాశ్రయంలో మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఐపీఎస్‌లు సుమన్ డీ పెన్నేకర్, సీమా లత్కర్ నేతృత్వంలో ప్రజ్వల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి. మహిళా పోలీసులే ప్రజ్వల్‌ను జీపులో సీఐడీ కార్యాలయానికి తరలించారని పేర్కొన్నాయి.
"ప్రజ్వల్‌ను అరెస్టు చేయడానికి మహిళా పోలీసులను పంపాలని ఓ పిలుపు ఉంది. ప్రజ్వల్ తన హోదా, అధికారాన్ని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అధికారం మహిళా పోలీసులకు ఉంది. ఈ నిర్ణయంతో మహిళా అధికారులు ఎవరికీ భయపడరని బాధితులకు ఓ సందేశం వెళ్తుంది"
- సిట్ వర్గాలు
'చట్టపరంగానే అరెస్ట్ చేశాం'
ప్రజ్వల్ రేవణ్ణను చట్టపరంగానే అరెస్ట్ చేశామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ప్రజ్వల్ పై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. "ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలోని మ్యూనిచ్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఉండడం వల్ల సిట్ ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. బాధితులకు ప్రభుత్వంగా అండగా ఉంటుంది" అని పరమేశ్వర హామీ ఇచ్చారు.
పొటెన్సీ టెస్ట్ కోసం సిట్ యత్నం!
అరెస్ట్ చేసిన తర్వాత ప్రజ్వల్‌ను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రజ్వల్‌ను కోర్టులో హాజరుపరిచి, విచారణ కోసం పోలీసు కస్టడీ కోరనున్నట్లు పేర్కొన్నాయి. నిర్ణీత సమయంలో ప్రజ్వల్‌కు పొటెన్సీ టెస్ట్ నిర్వహించాలని సిట్ ఆలోచిస్తోందని వెల్లడించాయి. ప్రజ్వల్‌కు బీపీ, షుగర్, కార్డియాక్ హెల్త్ సహా పలు వైద్య పరీక్షల కోసం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆస్పత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు, ప్రజ్వల్‌కు కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
'సిట్ దర్యాప్తునకు ప్రజ్వల్ సహకరిస్తున్నారు'
లైంగిక ఆరోపణల కేసులో సిట్ దర్యాప్తునకు ప్రజ్వల్ రేవణ్ణ సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది అరుణ్ తెలిపారు. హసన్ జిల్లా హోలెనరసిపురాలో ప్రజ్వల్ పై నమోదైన కేసులో ఆయనను సిట్ అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ కేసుపై ఎవరూ అసత్య ప్రచారాన్ని చేయొద్దని ప్రజ్వల్ చెప్పారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
-
#WATCH | Bengaluru, Karnataka: Advocate Arun, representing suspended JD(S) leader Prajwal Revanna, says, "He has come forward to cooperate in the investigation. His request to the media is that there should be no media trial. He has been arrested in the Holenarasipura case..." pic.twitter.com/8PHyTD3kXz
— ANI (@ANI) May 31, 2024
నోటీసులు, విజ్ఞప్తుల తర్వాత దేశానికి!
పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం వల్ల ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బహిరంగంగానే కోరారు. ఈ క్రమంలో ప్రజ్వల్ శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
'ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి'- మోదీకి కర్ణాటక సీఎం లేఖ
'ప్రజ్వల్ లొంగిపో- ఎన్ని రోజులు దొంగా పోలీసు ఆట ఆడతావు?'- కుమారస్వామి హితవు