Population Census India : కొన్నేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనగణన సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా వెల్లడించింది. జనాభా లెక్కల కోసం దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనుండగా, 12నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు పేర్కొంది.
తొలిసారిగా 1881లో జనగణన
దేశంలో తొలిసారి 1881లో జనగణన నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి పదేళ్లకోసారి దశాబ్దం ప్రారంభంలో నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలు, చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు జరిగిన సమయంలోనూ దేశంలో జనాభా లెక్కల సేకరణ ఆగలేదు. 2011లో చివరిసారి జనగణన నిర్వహించారు. అయితే 2021లో మళ్లీ చేపట్టాల్సిన జనాభా లెక్కలు, కరోనా తదితర కారణాలతో వాయిదాపడ్డాయి. ఆ సమయంలోనే అమెరికా, రష్యా, యూకే, బ్రెజిల్, చైనా, బంగ్లాదేశ్ వంటివి జనాభా లెక్కలు సేకరించాయి. ఈక్రమంలోనే లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల తాత్కాలిక బడ్జెట్లోనూ ఈ కార్యక్రమానికి కేటాయింపులు చేశారు.
అన్నింటికి 2011 లెక్కలే ఆధారం
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికీ రేషన్ కార్డుల జారీ వల్ల కనీసం పది కోట్ల మంది వరకు అర్హులకు సంక్షేమ పథకాలు అందట్లేదనేది విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ పథకాలకు సంబంధించీ 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందించాల్సి వస్తోంది. తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న నీతి ఆయోగ్ లెక్కల్ని నిపుణులెందరో ఇటీవల పరిశీలించారు. బహుముఖ పేదరికాన్ని మదింపు వేసేందుకు అసంబద్ధ ప్రాతిపదికలు ఎంచుకోవడమేమిటన్న తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటికే చైనాను దాటిన భారత్
కాగా ఈసారి కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలనే డిమాండ్లు వస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లకు పైమాటే.