Police Did Orphan Girl Marriage : ఉత్తరాఖండ్‌లోని పిథోర్గఢ్కు చెందిన ఓ పోలీసు ఇన్స్పెక్టర్ తన మంచి మనసును చాటుకున్నారు. అనాథ యువతిని దత్తత తీసుకుని ఘనంగా వివాహం జరిపించి అత్తవారింటికి పంపించారు. ఆయనకు తోటి పోలీసులు కూడా అండగా నిలిచారు. అనాథ బాలికకు అన్నదమ్ముల్లా నిలిచి వివాహ వేడుకను జరిపించారు. పోలీసుల చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
ధార్చుల గ్రామానికి చెందిన పుష్ప అనే అమ్మాయి తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించాడు. అప్పటినుంచి పుష్పను ఆమె అమ్మమ్మ పెంచింది. ఆమె కూడా 10ఏళ్ల క్రితం తుదిశ్వాస విడిచింది. దీంతో పుష్ప అనాథగా మిగిలిపోయింది. ఆ తర్వాత పొట్టకూటి కోసం పుష్ప పని వెతుక్కుంటూ పిథోర్గఢ్కు చేరుకుంది. అక్కడ కొన్నాళ్ల పనిచేశాక ఉద్యోగం నుంచి తొలగించారు. అలా చేసేదేంలేక పిథోర్‌గఢ్‌లోని ఓ దేవాలయం వద్ద పుష్ప ఉంది. అప్పుడు అటుగా వెళ్తున్న పిథోర్‌గఢ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నరేశ్ చంద్ర జఖ్మోలా పుష్పను చూశారు. ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. అందుకు బదులుగా తనకు ఏదైనా పని ఉంటే ఇప్పించమని పుష్ప పోలీస్‌ను కోరింది.
గ్రాండ్‌గా వివాహం- అన్నదమ్ముల్లా పోలీసులు
అప్పుడు నరేశ్ చంద్ర జఖ్మోల మనసులో ఓ ఆలోచన వచ్చింది. అనాథగా ఉన్న పుష్పను దత్తత తీసుకోవాలని అనుకున్నారు. అనాథను దత్తత తీసుకున్న విషయాన్ని కొంత కాలం ఎస్పీ రేఖా యాదవ్, సీఓ పర్వేజ్ అలీకి తెలియజేశారు. ఆ తర్వాత థాల్కు చెందిన విపిన్‌తో పుష్ప పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి వేడుకను పోలీస్ లైన్స్‌లోని గౌరీ హాల్ ఆడిటోరియంలో నిర్వహించారు. పుష్పకు సంప్రదాయం ప్రకారం వివాహం చేసి అత్తమామల ఇంటికి పోలీసులు పంపారు. పుష్ప పెళ్లి విషయంలో నరేశ్ చంద్ర జఖ్మోలాకు తోటి ఉద్యోగులు సాయం చేశారు. ఆమె పెళ్లికి ఆర్థికంగా అండగా నిలిచారు. సొంత సోదురుల్లా పెళ్లి కుమార్తె పల్లకిని మోశారు.
పెళ్లికి వచ్చిన అతిథులకు ఒక్కో మొక్క గిఫ్ట్
మరోవైపు రాజస్థాన్ ధోల్‌పుర్‌కు ఓ రిటైర్డ్ టీచర్ పర్యావరణం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. తన కుమార్తె పెళ్లికి వచ్చిన అతిథులకు ఒక్కొ మొక్కను బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా పెళ్లికి వచ్చిన అతిథులతో మొక్కలను పెంచుతామని, సంరక్షిస్తామని ప్రమాణం కూడా చేయించారు. ఈయన తీసుకున్న నిర్ణయం పట్ల ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల్లో రిటైర్డ్ టీచర్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
చిల్‌చోంద్ గ్రామానికి చెందిన మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంవిలాస్ రావత్ కుమార్తె నీలం వివాహం మంగళవారం జరిగింది.పెళ్లికి వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అతిథులకు మొక్కలను అందజేశారు. 'అడవుల నరికివేత పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తోంది. నా కుమార్తె వివాహానికి అతిథులకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని సంకల్పించుకున్నా. నా వియ్యంకులు ఈ విషయంపై అంగీకరించారు' అని రిటైర్డ్ టీచర్ రాంవిలాస్ రావత్ తెలిపారు.