PM Swearing Ceremony Preparations : జూన్ 9 లేదా 10వ తేదీన కొత్తగా ఎన్నికైన ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో రాష్ట్రపతి భవన్లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను దిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమం భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమావేశం జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర భద్రతా సంస్థలు, దిల్లీ పోలీసులు ప్రమాణ స్వీకారానికి పటిష్ఠ భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
దాదాపు 10వేల మంది హాజరు
రాష్ట్రపతి భవన్లో కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగాల్సి ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కార్యక్రమం వేదిక మారితే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది కొత్త ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీఏ వైపు ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
అయితే జూన్ 1న వెలువడిన లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. భారీ మెజార్టీతో ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో వరుసగా మూడోసారి ఏర్పాటు చేస్తుందని తెలిపాయి.
సంబరాలకు మహిళలు సిద్ధం
ఉత్తర్ప్రదేశ్ వారణాసి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ గెలుస్తురన్న అంచనాల నేపథ్యంలో విజయోత్సవాలకు ముస్లిం మహిళలు సిద్ధమయ్యారు. లాంహీలోని సుభాష్ భవన్లో ముస్లిం మహిళలు హిందువులతో కలిసి పాటలు పాడుతూ లడ్డూలను తయారు చేశారు. 400 దీపాలను వెలిగించి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోస్టర్లతో గీతాలు ఆలపించారు. మోదీ, అమిత్ షా తలపై విజయ కిరీటాన్ని ఉంచి, నరేంద్ర మోదీకి హారతి ఇచ్చారు. బీజేపీకి, ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఈసారి మోదీ ప్రభుత్వం గెలిస్తే సోదరీమణులకు మరిన్ని హక్కులు వస్తాయని, తాము సరిహద్దును దాటుతామని నినదించారు.
'ముస్లిం మహిళలకు మోదీ గెలుపు చాలా ముఖ్యం. యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాతే ముస్లిం మహిళలకు ఊరట లభిస్తుంది' అని ముస్లిం మహిళా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు నజ్నీన్ అన్సారీ తెలిపారు. 'మోదీని ద్వేషించే వాళ్లకు దేశ ప్రజలే సమాధానం ఇస్తున్నారని అన్నారు . ప్రతి ఇంట్లో మోదీకి గౌరవం లభిస్తోంది. ఓటు వేసేటప్పుడు ప్రజలు మోదీ ముఖాన్ని మాత్రమే చూశారు. మోదీ మమ్మల్ని నమ్మారు. మేము ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం' అని మోదీపై పీహెచ్డీ చేసిన డాక్టర్ నజ్మా పర్వీన్ తెలిపారు.