PM Modi On Godhra Riots : లోక్‌సభ ఎన్నికల మూడోవిడత పోలింగ్ తేదీ సమీపించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై ఆరోపణలకు మరింత పదును పెంచారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన గోద్రా ఘటనను ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని దర్భంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, 2002లో జరిగిన గోద్రా రైలు దహన ఘటనలో 60మందికిపైగా కరసేవకులను సజీవంగా కాల్చిచంపిన నిందితులను కాపాడేందుకు అప్పటి రైల్వే శాఖ మంత్రి, ఇప్పటి ఆర్జేడీ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ ప్రయత్నించినట్లు ఆరోపించారు. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు గోద్రా ఘటన జరిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కూడా బుజ్జగింపు రాజకీయాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.
"బుజ్జగింపు రాజకీయాలను ఆర్జేడీ ఎల్లప్పుడూ చేసింది. గోద్రాలో కరసేవకులను సజీవ దహనం చేసినప్పుడు అప్పుడు రైలు మంత్రిగా ఈ యువరాజు(తేజస్వీ యాదవ్) తండ్రే (లాలూ ప్రసాద్) ఉన్నారు. ఆయన దోషులను కాపాడేందుకు సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేశారు. అప్పుడు సోనియా గాంధీ రాజ్యం ఉండేది. ఆ జడ్జి పేరు బెనర్జీ కానీ ప్రజలు బెన్‌రాజీ అనేవారు. 60 మంది కరసేవకులను సజీవదహనం చేసిన వారిని నిర్దోషులని చెప్పేలా రిపోర్టు ఇచ్చారు. కోర్టు ఆ రిపోర్టును విసిరివేసింది. దోషులందరికీ శిక్ష విధించింది. కొందరికి ఉరి శిక్ష కూడా పడింది."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
అంతకుముందు ఝార్ఖండ్ పలామూలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, దేశంలో అవినీతికి పాల్పడినవారు వచ్చే ఐదేళ్లలో పర్యవసానాలను అనుభవిస్తారని హెచ్చరించారు. ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన మోదీ, వచ్చే ఐదేళ్లలో అవినీతికి దేశంలో చోటులేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన మోదీ, ఆ పార్టీ యువరాజును ప్రధాని పదవిలో చూడాలని పాకిస్థాన్ నేతలు ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో బలహీన సర్కార్ ఉండాలనే ఉద్దేశంతోనే పాక్‌లో కాంగ్రెస్ గెలవాలనే ఆకాంక్షతో ఉన్నట్టు మోదీ వివరించారు. అయితే ఇప్పుడు భారత్ మాత్రం బలమైన ప్రభుత్వాన్నే కోరుకుంటోందని స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలారా గుర్తు తెచ్చుకోండి. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు, ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు, నిర్దోషులను ముష్కరులు చంపినప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు పాకిస్థాన్‌కు ప్రేమ లేఖలు పంపేది. మీరు నాకు వేసిన ఓటు నన్ను ఎంతో బలోపేతం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగింది ఇక చాలు పాకిస్థాన్ ఆటలు సాగవని నేను చెప్పాను. ఇప్పుడున్న కొత్త భారత్, పాకిస్థాన్‌కు పత్రాలు పంపదు. ఉగ్రవాదులను వారి ఇంటికే వెళ్లి హతమారుస్తుంది. భారత్ చేసిన సర్జికల్ దాడులు, బాలాకోట్ దాడులు పాకిస్థాన్‌ను కుదిపేశాయి. ఒకప్పుడు భారత్‌లో ఉగ్రదాడి జరిగితే బలహీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ దేశాల వద్దకు వెళ్లి ఏడ్చేది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు పాకిస్థాన్ ప్రపంచ దేశాల వద్దకు వెళ్లి ఏడుస్తోంది. రక్షించండి, రక్షించండి అని కేకలు పెడుతోంది. నేడు పాకిస్థాన్ నేతలు కాంగ్రెస్ యువరాజును ప్రధానిని చేయడానికి ప్రార్థనలు చేస్తున్నారు. కానీ బలమైన భారత్ ఇప్పుడు బలమైన ప్రభుత్వాన్నే కోరుకుంటోంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ఒకరు దేశాన్ని, మరొకరు బిహార్‌ను తమ సొంత జాగీర్‌గా భావించారని దుయ్యబట్టారు
'యువరాజుకు వయనాడ్‌లో ఓడిపోతానని భయం- అందుకే రాయ్‌బరేలీలో పోటీ' - lok sabha elections 2024