PM Modi On Indi Alliance : ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందన్న ప్రధాని, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా దాన్ని రద్దు చేయలేరని పేర్కొన్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించటం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యాంగం పేరుతో తనను దూషిస్తోందని ప్రధాని మండిపడ్డారు.
రాజస్థాన్‌లోని బాఢ్‌మేర్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. అందువల్ల సరిహద్దు ప్రాంత జిల్లాలు అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉన్నాయని ప్రధాని ఆక్షేపించారు. దేశానికి ఇరువైపులా ఉన్న పొరుగుదేశాల వద్ద అణ్వాయుధాలు కలిగి ఉండగా, మనం మాత్రం వాటిని ధ్వంసం చేయాలా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఇండి కూటమి పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మేలుచేసే విధంగా ఆలోచిస్తున్నాయని దుయ్యబట్టారు.
"ఇండి కూటమిలోని మరో పార్టీ దేశానికి వ్యతిరేకంగా ప్రమాదకర ప్రకటన చేసింది. దానిని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. పోఖ్రాన్ గడ్డ భారత్‌ను అణ్వస్త్ర దేశంగా మార్చింది. ఇండి కూటమిలోని పార్టీ దేశంలోని అణ్వాయుధాలను ధ్వంసం చేసి సముద్రంలో పారేస్తామని ప్రకటించింది. పొరుగు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండగా, మన దేశంలో వాటిని ధ్వంసం చేయాలని ఇండి కూటమిలోని పార్టీ ఆలోచిస్తోంది. నేను కాంగ్రెస్‌ను ఒక్క విషయం అడగాలని అనుకుంటున్నాను. ఇండి కూటమిలోని ఆ పార్టీ ఎవరి సూచనలతో పనిచేస్తోంది. ఇదేమీ కూటమి దేశాన్ని బలహీనం చేయాలని భావిస్తోంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
అంతకుముందు జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఉగ్రవాదం, వేర్పాటువాదం, దాడులు, రాళ్లు రువ్వటం, సరిహద్దుల్లో కాల్పులు వంటి భయాలు లేకుండా జరగనున్నాయని చెప్పారు. 370 అధికరణ రద్దు ద్వారా చాలా ఏళ్లుగా జమ్ముకశ్మీర్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు పలికినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం రద్దు చేసిన 370ఆర్టికల్‌ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా ఇతర రాజకీయపక్షాలకు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. జమ్ము కశ్మీర్ అభివృద్ధి పథంలో సాగుతోందని, తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు.
"మోదీ వికసిత్ భారత్ కోసం వికసిత్ జమ్ముకశ్మీర్ నిర్మాణానికి గ్యారంటీ ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు జమ్ముకశ్మీర్‌ను మళ్లీ పాత రోజుల దిశగా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. ఈ కుటుంబాల ద్వారా నడిచే పార్టీలు జమ్ముకశ్మీర్‌కు ఎవరూ చేయనంత నష్టం చేశాయి. ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే కుటుంబం చేత, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
భారత్‌ను శక్తిమంతంగా మార్చేందుకు తాను శ్రమిస్తుంటే ఇండి కూటమి నేతలు దేశాన్ని బలహీనపర్చే చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.