PM Modi Speech in Lok Sabha : గడిచిన ఐదేళ్లు సంస్కరణలు, పనితీరు, పరివర్తనకు గుర్తుగా నిలిచిపోతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వ పాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు. 17వ లోక్‌సభ చివరి సమావేశాల చివరి రోజున ప్రసంగించిన ఆయన గత ఐదేళ్ల కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల అనేక కష్టాలు పడ్డామని, ఎన్ని ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని అన్నారు. సంస్కరణలు, పనితీరు ఒకేసారి కనిపించడం చాలా అరుదు అని పేర్కొన్న ఆయన తమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
"దేశానికి బలమైన పునాది వేసే అనేక విప్లవాత్మక సంస్కరణలు గడిచిన ఐదేళ్లలో వచ్చాయి. అనేక తరాలుగా ఎదురుచూస్తున్న నిర్ణయాలకు 17వ లోక్‌సభ కాలంలో మోక్షం లభించింది. ఆర్టికల్ 370 రద్దు ఈ కాలంలోనే జరిగింది. ముమ్మారు తలాక్ రద్దు నిర్ణయం ఈ సభలోనే తీసుకున్నాం. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్‌సభ ఆమోదించింది. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావి భారతానికి ఎంతో ఉపయోగం. ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చాం. ట్రాన్స్‌జెండర్లకు పద్మ పురస్కారం ఇచ్చి గొప్ప మార్పు దిశగా అడుగువేశాం. మేం చేపట్టిన చర్యలతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు సంతోషిస్తాయని భావిస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాబోయే 25 ఏళ్లు భారత్‌కు ఎంతో కీలకమని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించనుందని చెప్పారు. రాజకీయ కార్యకలాపాలు ఎప్పుడూ ఉంటాయన్న మోదీ- వచ్చే 25 ఏళ్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నది దేశ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజల రోజువారీ జీవితంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని అన్నారు. త్వరలోనే దేశంలో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ ఎన్నికలపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్న మోదీ- ఎలక్షన్ల ద్వారా దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఓంబిర్లాపై ప్రశంసలు
ఈ సందర్భంగా స్పీకర్ ఓంబిర్లాపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. పక్షపాతం లేకుండా సభను నడిపించారని కొనియాడారు. అనేక సందర్భాల్లో కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఓపికతో సభను సజావుగా నడిపించారని ఓంబిర్లాను ప్రశంసించారు. ఓంబిర్లా స్పీకర్గా ఉన్న సమయంలోనే కొత్త పార్లమెంట్ భవనం నిర్మితమైందని గుర్తు చేశారు.
కాగా, ప్రస్తుత లోక్సభలో 222 బిల్లులు పాస్ అయ్యాయని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అనంతరం, సభ నిరవధికంగా వాయిదా పడింది. అటు, రాజ్యసభ సైతం నిరవధికంగా వాయిదా పడింది.
'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్!
'నవ భారత ప్రయాణానికి జనవరి 22న నాంది- చరిత్రలో నిలిచిపోయే తేదీ అది'