PM Modi Comments On Emergency : 1975లో అప్పటి ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యయిక పరిస్థితి ఒక మచ్చ మోదీ అభివర్ణించారు. మంగళవారం నాటికి ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని అన్నారు. ఈ మేరకు 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.
'కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతాభినందనలు. కొత్త పార్లమెంటులో 18వ లోక్‌సభ సమావేశమవుతోంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేయాలి. 2047 వికసిత్ భారత్ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకుసాగుదాం. మూడోసారి సేవచేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారు. సభ్యులందరినీ కలుపుకొని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజలు మా విధానాలను విశ్వసించారు' అని ప్రధాని మోదీ అన్నారు.
ఎమర్జెన్సీ ఒక మచ్చ
'సరికొత్త విశ్వాసంతో కొత్త సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగ ప్రొటోకాల్స్ పాటిస్తాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. అత్యయిక పరిస్థితికి రేపటి 50 ఏళ్లు పూర్తవుతాయి అత్యయిక పరిస్థితి ఒక మచ్చ. ప్రధాని మోదీ 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి. విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మూడోసారి అధికారంలోకి రావడం వల్ల మాపై మరింత బాధ్యత పెరిగింది. ' అని ప్రధాని మోదీ అన్నారు.
అంతకుముందు, నూతన లోక్‌సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు.
మరోవైపు, మంగళవారం 280మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది.