PM Modi Fires On Congress : కాంగ్రెస్ ఒక బాధ్యతారహిత పార్టీ అని, హిందువులను విభజించాలని చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హిందువుల్లో చీలికను తెచ్చి మరో వర్గానికి వ్యతిరేకం చేయాలనుకుంటుందని విమర్శించారు. అలాగే హస్తం పార్టీని విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీగా అభివర్ణించారు. మహారాష్ట్రలో రూ.7,600కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ బుధవారం దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
'కాంగ్రెస్ విద్వేషాలను వ్యాప్తి చేసే ఫ్యాక్టరీ'
"హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ గెలుపు దేశం మూడ్‌ను సూచిస్తోంది. మహారాష్ట్రలో కూడా భారీ విజయం సాధించాలి. ప్రతిపక్ష 'మహా వికాస్ అఘాడీ', అధికారం కోసం మహారాష్ట్రను బలహీనపరచాలని కోరుకుంటోంది. అయితే పాలకపక్షం 'మహాయుతి' సర్కార్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోంది. మహారాష్ట్రలో ఇంతవేగంగా ప్రాజెక్టులు పూర్తవ్వడం నేనెప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ హయాంలో అవినీతి విషయంలో అదే వేగం, స్థాయి కనిపించింది. కాంగ్రెస్ బాధ్యతారహిత పార్టీ. విద్వేషాలను రెచ్చగొట్టే ఫ్యాక్టరీ." అని అన్నారు నరేంద్ర మోదీ.
'ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది'
కాంగ్రెస్ అభివృద్ధి గురించి ఆలోచించదని ప్రధాని మోదీ విమర్శించారు. పేదలు, రైతులు, యువత, మహిళల అభివృద్ధితో కూడిన వికసిత్ భారతే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముస్లింలలో భయాందోళనలు సృష్టిస్తోందని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని ఆరోపించారు.
ప్రధానిపై మండిపడ్డ కాంగ్రెస్
మరోవైపు, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాజకీయ ప్రసంగం చేయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎందుకు ఉపయోగించారని ప్రశ్నించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును రాజకీయ ప్రసంగాలకు వాడుకోకూడని కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ ఛార్జ్ పవన్ ఖేడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
'మోదీ దేశాన్ని విభజిస్తున్నారు'
ప్రధాని, ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని విభజిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏకం చేస్తోందని చెప్పారు. "ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రసంగాలను గమనించండి. రాహుల్ దేశ ప్రజల ఐక్యత, ప్రేమ గురించి మాట్లాడతారు. ద్వేషం గురించి మాట్లాడరు. ప్రధాని మోదీ మాత్రం శ్మశానవాటికలు, మంగళసూత్రాలను ఆయన ప్రసంగాల్లో తీసుకొస్తారు. ఈ దేశాన్ని విభజించే పనిని ప్రధాని మోదీ, ఆయన పార్టీ తీసుకుంది." అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాత్ ధ్వజమెత్తారు.
గీతాభూమిలో అభివృద్ధిదే విజయం- కాంగ్రెస్‌కు నో ఎంట్రీ బోర్డులే: ప్రధాని మోదీ