PM Modi Election Rally Today : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతల మాటలు మంటలు రేపుతున్నాయి. అధికార ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష ఇండియా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ దీటుగా తిప్పికొట్టారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రధాని మోదీ, రుద్రపుర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్, నిరాశతో దేశంలో అగ్గిరాజేసేందుకు కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
"60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, పదేళ్లు అధికారం లేకపోయేసరికి దేశంలో అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేస్తోంది. అగ్నిపెట్టాలనే మాటలు మీకు(ప్రజలకు) ఆమోదయోగ్యమేనా? ఈసారి వారిని ఎన్నికల మైదానంలో లేకుండా చేయండి. అత్యయిక పరిస్థితి విధించిన కాంగ్రెస్, ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్లాలని భావిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నాయకుడు దక్షిణ భారత్‌ను దేశం నుంచి వేరు చేసి, రెండు ముక్కలు చేసే మాట అన్నారు. మీరు(ప్రజలు) చెప్పండి. దేశాన్ని ముక్కలు చేయాలనే వారికి శిక్షపడాలా వద్దా? కానీ కాంగ్రెస్ ఏం చేసింది. శిక్ష వేయటానికి బదులు ఎన్నికల టికెట్ ఇచ్చింది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'మోదీ వాటికి భయపడేవాడు కాదు'
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే అవినీతిపరుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పేదలు, మధ్య తరగతి వర్గాల హక్కులను అవినీతి హరిస్తుందన్నారు. వారి హక్కులను ఎవరు హరించే ప్రయత్నం చేసినా, చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు.
"అవినీతిపరులు మోదీని బెదిరిస్తున్నారు. 24 గంటలూ దూషిస్తున్నారు. అవినీతిని పారదోలాలని మేం అంటుంటే అవినీతిపరులను కాపాడాలని వారంటున్నారు. మీరు(ప్రజలు) చెప్పండి. అవినీతి పోవాలా వద్దా? ఇది దేశ ప్రజల మాట. మోదీ ప్రజల ప్రతి మాట వింటాడు. మోదీ వారి బెదిరింపులు, దూషణలకు భయపడేవాడు కాదు. మూడో విడతలో అవినీతిపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం. ఈ మాట గ్యారంటీ ఇచ్చేందుకు వచ్చాను."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'పదేళ్లు ట్రైలర్ మాత్రమే'
ఉత్తరాఖండ్ తర్వాత రాజస్థాన్‌లోని కోట్ పుత్లీలో విజయ్ శంఖనాదం పేరుతో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, గత పదేళ్లలో జరిగిన పనులన్నీ ట్రైలర్ మాత్రమే అని అన్నారు. అసలు సినిమా ఇంకా ఉందని చెప్పారు.
"మోదీ వినోదం కోసం జన్మించలేదు. మోదీ కష్టపడి పనిచేందుకు పుట్టాడు. ఎంతో జరిగి ఉండొచ్చు. కానీ పదేళ్లలో జరిగినదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా చాలా చేయాల్సి ఉంది. దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. రాజస్థాన్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రజల కలలే తన సంకల్పమని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు కనీసం రైతుల సమస్యలను అడగలేదని, కానీ తాను వారిని పూజించినట్లు చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు