PM Modi Cabinet Meeting Today : సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే నూతన ప్రభుత్వం కోసం మొదటి 100 రోజులకు, వచ్చే ఐదేళ్ల పాలన కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ రోడ్‌మ్యాప్ రూపొందించడంలో సంబంధిత మంత్రిత్వశాఖ కార్యదర్శులు, అధికారుల సలహాలను తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశాన్ని ప్రధాని నేతృత్వంలో నిర్వహించినట్లు సమాచారం. మార్చి 3న ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి వికసిత్ భారత్-2047 లక్ష్యంపై జరిపిన మేధోమథనంలోనూ ఈ అంశంపై చర్చించారు.
మరోవైపు, ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు పంపడం ద్వారా ఎన్నికల ప్రక్రియను కెబినేట్ ప్రారంభించింది. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 20న జారీ చేస్తారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఆ దశ పోలింగ్‌కు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
'సార్వత్రిక సంగ్రామానికి మేం సర్వసన్నద్ధం'
మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ఈ సార్వత్రిక మహాసంగ్రామానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తన పదేళ్ల హయాంలో దేశం అన్ని రంగాల్లో అమోఘమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రస్తుతం విపక్షాల పరిస్థితి చుక్కాని లేని నావలాగ ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు విన్నవించుకోవడానికి వారి వద్ద అంశాలే లేవని చురకలు అంటించారు. ' మేము మళ్లీ అధికారంలోకి వస్తే పేదరికం, అవినీతిపై యుద్ధాన్ని మరింత వేగవంతం చేస్తాం. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేస్తాం. గత పాలకులు సృష్టించిన అంతరాలను సరిచేసేందుకు దశాబ్ద కాలం సరిపోయింది. మా పాలనలో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాం. సుసంపన్న, స్వయంసమృద్ధ భారత్ ఆవిష్కరణకు బాటలు వేశాం. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం ' అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
లాటరీ కింగ్ నుంచి డీఎంకేకు రూ.509కోట్లు- బీజేపీకి బాండ్ల ద్వారా రూ.6,986కోట్లు
ఎన్నికల షెడ్యూల్లో మార్పులు- ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ జూన్ 4 బదులు ఈ తేదీన!