Parliament Session 2024 : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అంశంపై పార్లమెంటు ఉభయసభలు దద్ధరిల్లాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ సోమవారానికి(జులై 1) వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి, నీట్‌పై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ అందుకు అంగీకరించకపోవటం వల్ల విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనటం వల్ల స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సమావేశమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటం వల్ల సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల నినాదాలతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు
నీట్ పరీక్ష లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినదని, దానిపై చర్చకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు నిలిపి నీట్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని, తగినంత సమయం కూడా ఇస్తామని స్పీకర్ తెలిపినా, ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. విపక్షాలు ఎంతకీ శాంతించకపోవడం వల్ల స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత సోమవారానికి వాయిదా వేశారు.
చర్చ జరగాల్సిందే: రాహుల్
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పార్లమెంట్‌లో గౌరవప్రదంగా మంచి చర్చ జరిగేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. దేశంలో నీట్ సమస్య అత్యంత ముఖ్యమైందని, అన్నింటికంటే ముందు దీనిపైనే పార్లమెంట్‌లో చర్చ జరగాలని రాహుల్ అన్నారు. విద్యార్థుల ఆందోళనలను ఉధృతం చేస్తున్నారని, ఈ సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి ఉన్నాయని, మీ సమస్యపై చర్చిస్తున్నాయని పార్లమెంటు ద్వారా యువతకు సందేశం పంపాలని రాహుల్ సూచించారు.
రాజ్యసభలోనూ
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం వల్ల రాజ్యసభ కార్యకలాపాలు కూడా వాయిదా పడ్డాయి. నీట్ సమస్యపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖఢ్ ఆమోదించలేదు. చర్చ డిమాండ్‌ను ఆమోదించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కోరినా ఛైర్మన్ అంగీకరించలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు తిరిగి తమ స్థానాల్లో కూర్చోవాలని ఛైర్మన్ కోరినా వారు నిరాకరించారు. దీంతో సభ వాయిదా పడింది.