Opposition Fire On Modi Comments : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచుతుందంటూ రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష ఇండి కూటమి నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. మొదటి దశ ఓటింగ్‌తో నిరాశకు గురైన మోదీ, దిగజారి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపారమైన మద్దతు లభిస్తుందన్న వార్తలతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశం మొత్తం ఉపాధి, కుటుంబం భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని మోదీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా అన్నారు. మోదీ అబద్ధాలు చెప్పే విధానం దేశానికే కాక ప్రపంచానికి కూడా తెలుసని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు.
మోదీ ఏం అన్నారంటే?
"ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చిన వాళ్లు అందరూ ఒక మాట చెప్తున్నారు. వారందరూ ఏమంటున్నారంటే ఇప్పటి కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ కాదు అని. ఇప్పటి కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్ల చేతిలో చిక్కుకుంది. ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను చూడండి. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తుల సర్వేలను నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. మన సోదరీమణుల వద్ద ఎంత బంగారం ఉంది.? ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత డబ్బు ఉంది. స్థలాలు ఉన్నాయా? అనే లెక్కలు కూడా తెలుసుంటారట. అంతటితో ఆగకుండా ఇంకేమన్నారు. సోదరీమణుల బంగారాన్ని, సంపదను అందరికీ సమానంగా పంచుతామని కూడా కాంగ్రెస్ తెలిపింది. ఇది మీకు సమ్మతమేనా? మీ సంపదను ప్రభుత్వం పంచడం మీకు సమ్మతమేనా? మాతృమూర్తులు, సోదరీమణులకు బంగారం అంటే కేవలం ఓ ప్రదర్శించే వస్తువు కాదు. వారి ఆత్మభిమానానికి అది నిదర్శనం. కానీ కాంగ్రెస్ బంగారం తీసుకుంటాం. అందరికీ పంచుతాం అంటోంది. ఈ దేశంలో వనరులపై తొలి హక్కు ముస్లింలదే అని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే ఈ సందపనంతా కాంగ్రెస్ పార్టీ ఎవరికి పంచుతామని అంటోంది. ఎవరికి ఎక్కువ పిల్లలు ఉంటారో వాళ్లకి పంచుతామంటోంది. మీరు కష్టపడి సంపాదించుకున్న సంపదను చొరబాటుదారులకు ఇవ్వడం మీకు సమ్మతమేనా? కానీ ఈ అంశాన్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఈ అర్బన్ నక్సల్స్ ఆలోచన ఎలా ఉందంటే వాళ్లు మాతృమూర్తులు, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా వదలరు." అని నరేంద్రమోదీ అన్నారు.
మన్మోహన్‌సింగ్ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ
మరోవైపు మోదీ వ్యాఖ్యలు నిజమేనని చెప్తూ 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన 22 సెకన్ల వీడియోను బీజేపీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మన్మోహన్ వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌కు తమ ప్రధానిపైనే నమ్మకం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
"మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ మేం వినూత్న ప్రణాళికలను తీసుకురాబోతున్నాం. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలి."
--మన్మోహన్‌సింగ్, మాజీ ప్రధాని
ప్రధానమంత్రి హయాంలో మన్మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనూ తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై నాడు ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించింది.
విపక్షాలకు బీజేపీ కౌంటర్
మరోవైపు ప్రధాని మోదీపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది బీజేపీ. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని అర్థం కావడం వల్ల ఇండి కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశలో ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. ఇండి కూటమికి మూడు ప్రధాన అంశాలతో ఎజెండా ఉందని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలు, హిందూ వ్యతిరేక విధానాలు, దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం వారి ఎజెండా అని ఆరోపించారు.
-
#WATCH | BJP National Spokesperson Gaurav Bhatia says, "It is clear that NDA-BJP will get 400 plus seats. There is frustration in the opposition especially the INDI alliance and the Congress party. It won't be wrong to say that the INDI alliance and the Congress party have a… pic.twitter.com/pQFWHsEutN
— ANI (@ANI) April 22, 2024
ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టొచ్చు? అసలేంటీ వ్యయ పరిమితి? - Lok Sabha elections 2024