Odisha Woman Mortician Cremated 40000 Bodies In 14 Years : పురుషులు మాత్రమే చేసే కాటికాపరి పనిని గత 14 ఏళ్లుగా చేస్తోంది ఓ మహిళ. ఇప్పటివరకు సుమారు 40వేలకు పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసి తన సహృదయాన్ని చాటుకుంది ఒడిశాకు చెందిన ఓ మహిళా కాటికాపరి. ఆమె ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఈమె కథ వినాల్సిందే.
అన్ని తానై 14 ఏళ్లుగా
మయూర్‌భంజ్ జిల్లాలోని బారిపడా పట్టణానికి చెందిన లక్ష్మీ జెనా అనే మహిళ, తన భర్త, ఐదుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఈమె భర్త బారిపడా మున్సిపాలిటీలోని ఓ శ్మశానవాటికలో కాటికాపరి పనిలో కుదిరాడు. అయితే కొద్దిరోజులకే లక్ష్మీ భర్త అనారోగ్యం బారిన పడి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారం కావడం వల్ల శ్మశానవాటికలో భర్త నిర్వర్తించే కాటికాపరి పనులను తానే చేయాలని నిర్ణయించుకుంది లక్ష్మీ. అలా 14 ఏళ్ల క్రితం మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయడం ప్రారంభించింది. ఇలా ఇప్పటికే వేల కొద్ది శవాలకు దహన సంస్కారాలు నిర్వహించింది.
"నా పేరు లక్ష్మీ జెనా. నాకు ఐదుగురు పిల్లలు. గత 14 సంవత్సరాలుగా ఇక్కడి శ్మశానవాటికలో శవాలకు దహన సంస్కారాలు చేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 40వేలకు పైగా మృతదేహాలను దహనం చేశాను."
- లక్ష్మీ జెనా, కాటికాపరి
సర్వత్రా ప్రశంసలు
సనాతన ధర్మం ప్రకారం మహిళలు మృతదేహాల దహన సంస్కారాల్లో పాల్గొనరని.. కానీ, లక్ష్మీకి ఉన్న మానవతా హృదయంతో ఈ పని చేయగలుగుతోందని మున్సిపాలిటీ ఛైర్మన్ కృష్ణానంద్ మెహంతి తెలిపారు. కుటుంబ పోషణ కోసం కాటికాపరిగా పనిచేస్తున్న మహిళను స్థానికులతో పాటు అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు.
శ్మశానవాటికలోనే జీవనం
తెలంగాణలోని భద్రాచలంలోనూ ఇలాంటి తరహ ఘటన జరిగింది. భర్త వృత్తినే బతుకుదెరువుగా మార్చుకొని శ్మశాన వాటికలో కాటి కాపరిగా పనిచేస్తోంది ఓ మహిళ. ధైర్యంగా అడుగు ముందుకేసి తాను బతకడమే కాదు మరో ఐదు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి