Nitish Kumar Son Politics Entry : బిహార్‌లో కుటుంబ పాలనకు వ్యతిరేంగా పోరాడిన జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు నీతీశ్ కూడా అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. నీతీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ చాలా అరుదైన సందర్భాల్లో తన తండ్రితో కలిసి బహిరంగంగా కనిపిస్తారు. అయినప్పటికీ నిశాంత్ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు జేడీయూ నేత చేసిన ట్వీట్ కూడా ఓ కారణం.
'రాష్ట్రానికి యువ నాయకత్వం అవసరం'
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిహార్‌కు యువ నాయకత్వం అవసరమని జేడీయూ నేత, రాష్ట్ర ఆహార కమిషన్ చీఫ్ విద్యానంద్ వికల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిశాంత్ కుమార్‌లో రాజకీయాలకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది జేడీయూ నేతలు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తాను పంచుకుంటున్నానని పోస్ట్‌లో వెల్లడించారు. దీంతో నీతీశ్ కుమారుడు నిశాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.
అవన్నీ నిరాధారమైన వార్తలు
మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్న ఊహాగానాలను జేడీయూ మంత్రి విజయ్ కుమార్ చౌదరీ ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలని వెల్లడించారు. "చాలా సున్నితమైన ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవద్దని పార్టీ నాయకులను కోరుతున్నాను. నిశాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇటువంటి ఊహాగానాలు ప్రజల మనసులో సందేహాలను కలిగిస్తాయి." అని విజయ్ కుమార్ చౌదరీ పేర్కొన్నారు.
నెలాఖరులో జేడీయూ కార్యవర్గ సమావేశం
కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి రెండో అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న జేడీయూ జూన్ నెలాఖరులో దిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. 'పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్ణీత వ్యవధిలో జరగాలి. కానీ ఈసారి కాస్త ఆలస్యం అయ్యింది. జూన్ ప్రారంభంలో కార్యవర్గ సమావేశాలు జరగాల్సి ఉంది. రాజకీయ పరిస్థితులు వల్ల జూన్ నెలాఖరులో జరుగుతుంది. ఈ సమావేశంలో జేడీయూ ఎటువంటి ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంటుందని అనుకోవట్లేదు.' అని జేడీయూ కార్యకర్త ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు.
ఒక్క మామిడిపండు ధర రూ.90వేలు- రూ.లక్షల విలువైన పళ్లు దేవుడికి నైవేద్యం- ఎందుకో తెలుసా?