NIA Team Attacked In West Bengal : బంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వాహనంపై దాడి కలకలం రేపింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్‌కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ జిల్లాలోని భూపతినగర్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తమ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్ఐఏ తెలిపినట్లు ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ చెప్పారు. దీనిపై ఎన్ఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.
ఎన్ఐఏ అధికారుల వాహనంపై దాడి చేసిన గుంపు నిందితులను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. అరెస్టు చేసిన నిందితులతో, ఎన్ఐఏ అధికారులు ఉన్న భూపతినగర్‌కు భారీగా కేంద్ర బలగాలు చేరుకుంటున్నాయి. 2022 డిసెంబర్ 3న భూపతినగర్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు.
ఎన్‌ఐఏకి ఏ హక్కు ఉంది? : మమతా బెనర్జీ
ఈ ఘటనపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అర్ధరాత్రి ఎన్ఐఏ ఎందుకు దాడి చేసిందని ప్రశ్నించారు. తొలుత దాడి చేసింది మహిళలు కాదని ఎన్‌ఐఏ అధికారులేనని అన్నారు. అందుకే చేసేది లేక తిరిగి దాడికి పాల్పడ్డారన్నారు. ఎన్‌ఐఏ, సీబీఐ బీజేపీకి సోదరులైతే ఈడీ, ఐటీ ఆ పార్టీకి ఫండింగ్ బాక్సులంటూ విమర్శించారు. 'వారికి (ఎన్ఐఏ) పోలీసు అనుమతి ఉందా? అర్ధరాత్రి ఎవరైనా అపరిచితుడు తమ స్థలానికి వస్తే ఎలా స్పందిస్తారో, అదే విధంగా స్థానికులు స్పందించారు. ఎన్నికలకు ముందు వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు? ప్రతి బూత్ ఏజెంట్‌ను అరెస్టు చేయాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎన్‌ఐఏకి ఏ హక్కు ఉంది? బీజేపీకి మద్దతిచ్చేందుకే వాళ్లు ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం పోరాడాలని పిలుపునిస్తున్నాం' అని మమతా మండిపడ్డారు.
ఇలాంటి గుండాయిజానికి అనుమతి లేదు : బంగాల్ గవర్నర్
ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడిపై స్పందించిన బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, దీన్ని చాలా తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలన్నారు. ' దర్యాప్తు సంస్థలను బెదిరించే ప్రయత్నం ఎవరికీ క్రెడిట్ తెచ్చిపెట్టదు. ఈ విషయాన్ని ఉక్కు చేతితో ఎదుర్కొవాలి. ఇలాంటి గుండాయిజానికి ఎట్టిపరిస్థితిల్లోనూ అనుమతి లేదు.' అని బంగాల్ గవర్నర్ అన్నారు.