Nestle India Issue : చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర వినియోగంపై దిగ్గజ కంపెనీ నెస్లేపై వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. నెస్లేపై వచ్చిన ఆరోపణలను FSSAI పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పిల్లల ఉత్పత్తుల్లో చక్కెర వినియోగాన్ని నిషేధిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ నెస్లే కంపెనీ చిన్నారుల ఫుడ్ ఉత్పత్తి సెరెలాక్ లో సగటున 3 గ్రాముల చక్కెర అదనంగా ఉన్నట్లు స్విస్ పరిశోధనా సంస్థ పబ్లిక్ ఐ చేసిన పరిశోధనలో తేలింది. పబ్లిక్ ఐ నివేదికను FSSAI శాస్త్రీయ ప్యానెల్ ముందు ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా, నెస్లే కేవలం భారత్ లోనే కాకుండా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా పిల్లల ఆహార ఉత్పత్తుల్లో తేనె లేదా చక్కెరను జోడించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని పబ్లిక్ ఐ నివేదికలో పేర్కొంది. 15 భారతీయ సెరెలాక్ ఉత్పత్తుల్లో 2.7 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉన్నాయని వెల్లడించింది. నెస్లే లేబులింగ్ పోషకాలను హైలైట్ చేస్తున్నప్పటికీ, అందులో రాసిన చక్కెర శాతం మాత్రం పారదర్శకంగా లేదని చెప్పింది.
"పేద దేశాల్లో డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలను నెస్లే పాటించడం లేదు. అయితే అధిక ఆదాయ దేశాల్లో మాత్రం నిబంధనలు పాటిస్తోంది. జర్మనీ, యూకేలో ఆరు నెలల పిల్లలకు నెస్లే విక్రయించే సెరెలాక్‌లో చక్కెర ఉండదు. అదే ఉత్పత్తిలో ఇథియోపియాలో 5 గ్రాములు, థాయ్ లాండ్లో 6 గ్రాములు ఉంటాయి" అని రిపోర్ట్‌లో పేర్కొంది. పబ్లిక్ ఐ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మార్కెట్లలో ఉన్న 115 నెస్లే ఉత్పత్తులపై పరిశోధనలు చేపట్టగా, వాటిలో 108 అదనపు చక్కెరను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.
స్పందించిన నెస్లే ఇండియా
మరోవైపు తమపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నెస్లే ఇండియా స్పందించింది. గత 5 ఏళ్లలో చిన్నారుల ఫుడ్ ఉత్పత్తుల్లో 30 శాతం చక్కెరను తగ్గించామని వెల్లడించింది. తాము పోషకాహారం, నాణ్యత, భద్రత, రుచిపై రాజీ పడకుండా చిన్నారుల ఫుడ్ ప్రొడక్ట్స్‌పై చక్కెరల స్థాయిని మరింత తగ్గించడానికి కృషి చేస్తున్నామని నెస్లే కంపెనీ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. నెస్లే ఇండియా కంపెనీ తృణధాన్యాల ఉత్పత్తులు చిన్నారులకు ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ మొదలైన పోషకాహార అవసరాలను సముచితంగా అందించడానికి తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. "మా ఉత్పత్తుల పోషక నాణ్యతపై మేము ఎప్పుడూ రాజీపడం భారతదేశంలో తయారైన మా ఉత్పత్తులు WHO ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి" అని చెప్పారు.
షేర్లు ఢమాల్
నెస్లే ఇండియా శిశు ఆహార ఉత్పత్తుల్లో అదనపు చక్కెర ఉన్నట్లు నివేదిక వెలువడిన నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు గురువారం భారీగా పతనమయ్యాయి. గురువారం మధ్యాహ్నానికి నెస్లే ఇండియా షేర్లు 3.6 శాతం తగ్గి రూ.2,454 వద్ద ఉన్నాయి. ఇంట్రాడేలో దీని కనిష్ఠ ధర రూ.2,410 వద్ద ఉంది.