Jharkhand Elections NDA Seat Sharing : ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్‌లో ప్రస్తుతానికి AJSU పార్టీకి 10, జేడీయూకు 2, ఎల్‌జేపీకి ఒక స్థానాన్ని కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కో ఇన్‌ఛార్జ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం బీజేపీ 68 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. అయితే, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా సహా ప్రత్యర్థి పార్టీలు ఇంకా తమ ప్రణాళికలను వెల్లడించనందున ప్రస్తుతానికి బీజేపి వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తర్వాత సీట్ల సర్దుబాటులో మార్పులు ఉండవచ్చని హిమంత బిశ్వశర్మ అన్నారు.
ఇదిలా ఉండగా, ఝార్ఖండ్‌లో తొలివిడత పోలింగ్ జరిగే 43 స్థానాలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన, 30వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. రెండో దశలో నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 30, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 1 వరకు తుది గడువు ఉంది. రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
అభ్యర్థులు తమ నేర చరిత్రను న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ ద్వారా మూడుసార్లు ప్రకటనల రూపంలో వెల్లడించాల్సి ఉంది. రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటనల రూపంలో బహిరంగపర్చాల్సి ఉంటుంది.
ఝార్ఖండ్‌లో ద్విముఖ పోరు!
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)- కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు, సంక్షేమ పథకాలను ఇండియా కూటమి నమ్ముకుంది. సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా జేఎంఎం ఆరోపిస్తోంది. ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని జేఎంఎం, కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించాయి.