Nafe Singh Rathi Murder : హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బహదూర్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. నఫే సింగ్‌తో పాటు ఆయన అనుచరుడు కూడా ఈ తుపాకీ దాడిలో మరణించారు. ఈ ఘటనలో నఫే సింగ్ ప్రైవేట్‌గా నియమించుకున్న గన్‌మెన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దగ్గర్లోని బ్రహ్మశక్తి సంజీవని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నఫే సింగ్ రాఠీ ఆదివారం తన వాహనంలో ఝజ్జర్ జిల్లాలో ప్రయాణిస్తుండగా బరాహి గేట్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఆయన మృతిని ఐఎన్‌ఎల్‌డీ మీడియా సెల్ ఇన్‌ఛార్జ్ రాకేశ్ సిహాగ్ ధ్రువీకరించారు.
కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు నఫే సింగ్ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో కారు ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నఫే సింగ్ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, నఫే సింగ్‌పై కాల్పులకు తెగబడ్డ దుండగులు ఐ-10 కారులో వచ్చినట్లు చెప్పారు. నిందితుల కోసం సీఐఏ, ఎస్టీఎఫ్ బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఝజ్జర్ ఎస్పీ అర్పిత్ జైన్ తెలిపారు. మరోవైపు ఈ దాడిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని బీజేపీపై దుమ్మెతిపోశాయి. నఫే సింగ్‌పై జరిగిన ఈ దాడిని ఓ పిరికి చర్యగా అభివర్ణించారు INLD నాయకుడు అభయ్ చౌతాలా. 'ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నఫే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నఫే సింగ్ కేవలం పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు. నాకు సోదరుడు లాంటి వాడు' అని ఆయన అన్నారు.
ఎవరీ నఫే సింగ్ రాఠీ?
నఫే సింగ్ రాఠీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు. బహదూర్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నఫే సింగ్ ఆల్ ఇండియా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
బైక్‌ను తప్పించబోయి కంటైనర్‌కు ఢీ కొట్టిన కారు- 9మంది దుర్మరణం
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- ఏడుగురు దుర్మరణం- మరో ఏడుగురు సీరియస్!