Monsoon Prediction 2024 : జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిమీలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తూర్పు రాష్ట్రాల్లో వర్షపాత లోటును!
బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్ సహా తూర్పు రాష్ట్రాల్లో వర్షపాత లోటును ఎదుర్కొంటాయని స్కైమెట్ ఎండీ జితిన్ సింగ్ తెలిపారు. కేరళ, కర్ణాటక, గోవాలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్ నినో నుంచి లా నినాకు మారడం వల్ల సాధారణ రుతుపవనాలు కురుస్తాయని చెప్పారు. ఎల్నినో కాకుండా ఐవోడీ వంటి ఇతర అంశాలు కూడా రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఎల్నినో నుంచి లా నినాకు వేగవంతమైన మార్పు సీజన్ ప్రారంభానికి అంతరాయం కలిగిస్తుందని అంచనా వేశారు.
ఐఎండీ అలా!
ఇటీవల, ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు తగ్గిపోవడం, యురేషియాలో తగ్గిన మంచు కవచంతో నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ''మనదేశంలో ఎల్ నినో క్షీణిస్తుండటం గుడ్ న్యూస్ లాంటిది. జూన్ నెల మొదలయ్యే సమయానికి ఎల్ నినో తగ్గిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయిపోతాయి. రుతుపవనాల సీజన్ జులై-సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో మన దేశంలో లా నినా పరిస్థితులు ఏర్పడొచ్చు'' అని ఆయన తెలిపారు.
మంచు కవచం ప్రభావం!
దేశంలో రుతుపవనాలపై ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై ఉండే మంచు కవచం ప్రభావం చూపిస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. 'ఎల్ నినో' ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై మంచు కవచం తక్కువ మోతాదులోనే ఉందని, ఇది రుతుపవనాలకు కలిసొచ్చే పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి