Modi On Pakistan : దేశంలోకి ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పొరుగుదేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో భాగంగా దమోహ్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
"ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితి బాగాలేదు. అనేక దేశాలు దివాలా తీస్తున్నాయి. ఉగ్రవాదులను ఉసిగొల్పే పొరుగుదేశం ఒకటి. ఇప్పుడు గోధుమ పిండి కోసం తంటాలుపడుతోంది. ఇక్కడి ఓటర్లకు మంచి అవగాహన ఉంది. నేను ఏ ఒక్కరి పేరు ఎత్తకపోయినా కానీ మీకు (ప్రజలు) విషయం తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం ప్రపంచంలోనే చాలా వేగంగా అభివృద్ధి పథంలో సాగుతోంది"
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
"ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో గత 10 ఏళ్లుగా చూస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. కానీ మా ప్రభుత్వం మాత్రం అక్కడ ఉన్న భారత పౌరులను సురక్షితంగా తీసుకువచ్చింది. భారత్‌ను అతిపెద్ద ప్రపంచ శక్తిగా మార్చేందుకు రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించింది. ఈ ఏడాది ఇతర దేశాలకు రూ.21,000 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయనుంది. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ పథకం పొడిగించాం" అని మోదీ తెలిపారు.
ఆకలితో పాకిస్థాన్!
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాలుగేళ్ల నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తుంటే 23 కోట్ల జనాభా కలిగిన పొరుగు దేశం పాకిస్థాన్ ఆకలితో అలమటిస్తోందని అన్నారు.
"దేశాభివృద్ధి భూమి, సంక్షేమంతోనే సాధ్యమని చౌధురీ చరణ్‌సింగ్ చెప్పారు. రైతులు గౌరవం పొందినప్పుడే దేశ గౌరవం పెరుగుతుందన్నారు. ఆ పనే ఇప్పుడు ప్రధాని మోదీ చేస్తున్నారు. దేశంలో 80కోట్ల మంది నాలుగేళ్ల నుంచి ఉచితంగా రేషన్ అందుకుంటున్నారు. దేశం నుంచి వేరుపడిన పాకిస్థాన్ ఆకలితో అలమటిస్తోంది. అక్కడ 23కోట్ల జనాభా ఉంది. వారంతా ఆకలితో చనిపోతున్నారు. భారత్ మాత్రం 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తోంది" అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.