Modi On India Alliance : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. బిహార్‌లోని పాటలీపుత్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. విపక్షాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.
ఇండియా కూటమి నేతలు రాజ్యాంగానికి విరుద్ధంగా మతప్రాదికన రిజర్వేషన్లు కోరుతున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. తాను బతికి ఉన్నంత వరకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌లు లాక్కునే ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ ఉద్ఘాటించారు. ఎల్ఈడీ బల్బులు ఉండాల్సిన యుగంలో బిహార్ ప్రజలు లాంతర్లతో తిరుగుతున్నారని వివరించారు. ఆ లాంతరు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి మాత్రమే వెలుగు నింపిందనీ, యావత్ బిహార్‌ను అంధకారమయం చేసిందని మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురిని ప్రధానులను చేస్తుందని పునరుద్ఘాటించారు. కష్టపడుతున్న మోదీకి, అబద్ధాలు చెబుతున్న ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని వివరించారు.
మోదీని దూషించే పనిలోనే ఇండియా కూటమి
ఈ 2024 ఎన్నికల్లో ఒక వైపు మీ అందరి కోసం 24 గంటలు కష్టపడుతున్న మోదీ, మరో వైపు 24 గంటలు మీకు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉందని ప్రధాని మోదీ అన్నారు. '2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా చేయడం కోసమే 24 గంటలు పని చేస్తున్నా. దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఆధునికమైన రోడ్లు, రైల్వేలను నిర్మిస్తున్నా. మరోవైపు ఏమి పని లేని ఇండియా కూటమి ఉంది. కేవలం రేయింబవళ్లు మోదీని దూషించే పనిలో ఇండియా కూటమి నిమగ్నమై ఉంది. ఐదేళ్లలో ఐదు ప్రధానమంత్రులకు ఇండియా కూటమి ప్లాన్ చేస్తుంది. అయిన ఇండియా కూటమి నాయకులు ఎప్పుడు తమ కుటుంబ సభ్యలను మాత్రమే ముందుకు తెస్తుంది. ఓటు బ్యాంక్ కోసమే ఇండియా కూటమి మోదీని ఆరోపించే పనిలో 24 గంటలు బిజీగా ఉంది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు.