Modi On Congress : కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రజల సంపాదన, ఆస్తులపై కన్నేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహిళల మంగళసూత్రాలపై వారి దృష్టి పడిందని, ఇండియా కూటమి నేతలు వాటిని దొంగలించేందుకు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రజల ఆస్తులపై సర్వే నిర్వహించి వాటిని అందరికీ పంచేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను చివరిసారి అలీఘడ్కు వచ్చినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ బంధుప్రీతి, అవినీతి బుజ్జగింపుల ఫ్యాక్టరీకి తాళం వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేశాను. మీరు దీన్ని చాలా చక్కగా చేశారు. కాబట్టి యువరాజులు (రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి) ఇద్దరూ దాని తాళం చెవిని పొందలేరు. మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మళ్లీ ఇక్కడికి వచ్చాను"
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
అందుకే ట్రిపుల్ తలాక్ చట్టం: మోదీ
రాష్ట్రంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఏమీ చేయలేదని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ వల్ల చాలా మంది ముస్లింల కుమార్తెల జీవితాలు నాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది యువతులు, మహిళలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వ హయాంలో వారందరికీ ఉపయోగపడేలా ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చామని మోదీ గుర్తుచేశారు.
"ఒకప్పుడు హజ్ కోటా తక్కువగా ఉండడం వల్ల చాలా గొడవలు జరిగేవి. గత ప్రభుత్వాలు లంచాలు కూడా తీసుకున్నాయి. రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్లే హజ్‌కు వెళ్లేందుకు అవకాశం దక్కేది. భారత సోదరసోదరీమణులు అందరూ హజ్‌కు వెళ్లేందుకు కోటాను పెంచాలని నేను సౌదీ అరేబియా యువరాజును అభ్యర్థించాను. అయితే ఆయన హజ్ కోటాను పెంచడం మాత్రమే కాకుండా వీసా నియమాలను కూడా సులభతరం చేశారు. దీంతో చాలా మంది హజ్‌కు వెళ్తున్నారు. వారందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు" అని ప్రధాని మోదీ తెలిపారు.
'తొలి దశ నిరాశతోనే దిగజారుడు వ్యాఖ్యలు'- ప్రధానిపై భగ్గుమన్న విపక్షాలు - Lok Sabha elections 2024