Modi Congress Manifesto Reactions : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు మించడం కష్టమనే భయంతోనే ప్రధాని మోదీ మళ్లీ హిందూ ముస్లిం అస్త్రాన్ని అందుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
తన పాత్ర మిత్రుడిని గుర్తుకు తెచ్చుకున్న బీజేపీ
లోకసభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందనే ఆర్ఎస్ఎస్ తన పాత మిత్రుడైన ముస్లిం లీగ్‌ని గుర్తు చేసుకోవటం ప్రారంభించిందని మల్లికార్జున ఖర్గే అన్నారు.' కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఇది సామాన్య భారతీయుల సహకారంతో తయారు చేశాం. మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942లో మోదీ, అమిత్ షా పూర్వ సిద్ధాంతకర్తలు వ్యతిరేకించారు. 1940లో బంగాల్, సింధ్‌లో ముస్లిం లీగ్‌తో కలిసి మీ పూర్వ సిద్ధాంతకర్తలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. మా సమష్ఠి బలంతోనే ప్రధాని మోదీ పదేళ్ల అన్యాయానికి తెరపడుతుంది' అని ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ భవిష్యత్ బ్లూప్రింట్
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైనప్పటి నుంచి బీజేపీ శ్రేణుల్లో భయాందోళనలు నెలకొన్నాయని సుప్రియా శ్రీనేత్ అన్నారు. 'బీజేపీ ప్రాబల్యం రోజు రోజుకూ తగ్గిపోతుంది. అందుకే ముస్లిం లీగ్‌పై ప్రధానికి ఉన్న ప్రేమ మళ్లీ పుంజుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది దేశ భవిష్యత్తుకు సంబంధించిన బ్లూప్రింట్. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రధాని తన రిపోర్ట్ కార్డును చూపించి ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మరోసారి అదే హిందూ - ముస్లిం అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం తెచ్చిన సమస్యలకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్‌లో పరిష్కారం ఉంది. వాస్తవానికి మోదీకి ముస్లిం లీగ్‌పై ప్రేమ కొత్తది కాదు. తమ పూర్వీకుల నుంచే ఉంది. గ్యారంటీ అనే పదాన్ని పదే పదే అనడం వల్ల మీ మాట ఎవరూ వినురు మోదీజీ. ఇక మీరు బ్యాగ్‌లు సర్దుకోవడానికి సిద్ధంగా ఉండండి' అని సుప్రియా శ్రీనేత్ అన్నారు.