Model Solar Village Component : దేశంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన'. ఈ పథకంలో భాగంగా 'సోలార్ మోడల్ విలేజ్' కాంపొనెంట్‌ను అమలు చేసేందుకు సోమవారం ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని గ్రామాలు, సౌర విద్యుత్‌ను ఉపయోగించడం, ఇంధన అవసరాల్లో స్వయం ప్రతిపత్తి పొందడం ఈ పథకం లక్ష్యం అని న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ అమలులో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి రూ.కోటి చొప్పున ఇప్పటికే రూ.800 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.
ఎంపిక ఇలా
ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం, పోటీ పద్ధతిలో గ్రామాల ఎంపిక జరుగుతుంది. పోటీ పడే గ్రామం కచ్చితంగా రెవెన్యూ గ్రామం అయి ఉండాలి. ఆ గ్రామంలో జనాభా 5000(స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో 2,000) కంటే ఎక్కువ ఉండాలి. అనంతరం జిల్లా స్థాయి కమిటీ (DLC) పోటీ గ్రామాల జాబితాను ప్రకటిస్తుంది. 6 నెలల తర్వాత, ఆయా గ్రామాల డిస్ట్రిబ్యూటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ (RE) కెపాసిటీని అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. జిల్లాలో అత్యధిక పునరుత్పాధక ఇంధన సామర్థ్యం ఉన్న గ్రామానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణలో, స్టేట్/యూటీ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన గ్రామాలు సౌర శక్తి వినియోగం దిశగా అడుగులు వేస్తున్నాయా, దేశంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయా అని ఈ ఏజెన్సీ నిర్ధరిస్తుంది.
పీఎం సూర్య ఘర్ యోజన
కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన' పథకానికి కేంద్ర కేబినెట్ 2024 ఫిబ్రవరి 29న ఆమోదం తెలిపింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతారని వెల్లడించారు. ఇక పథకం కింద ఎంపికైన వారికి రూ.30వేలు(1kw రూఫ్‌టాప్ సోలార్), రూ.60వేలు(2kw) చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం- అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్- అప్లై చేసుకోండిలా
300 యూనిట్ల ఫ్రీ కరెంట్- ఏటా రూ.18 వేలు ఆదా- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా!