Uttar Pradesh Road Accident Today : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది మృతిచెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారణాసి-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై కచ్వాన్ ప్రాంతంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా వారణాసి వాసులని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భదోడి జిల్లాలో పని ముగించుకుని 13మంది కూలీలు ట్రాక్టర్ ట్రాలీలో వారణాసి బయలుదేరారు. కచ్వారా-మిర్జమురాద్ మధ్య ఉన్న జీటీలో వెళ్తున్న ట్రాక్టర్, మిర్జాపుర్-వారణాసి సరిహద్దుకు చేరుకోగానే- వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో టాక్టర్ ట్రాలీలో ఉన్న 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. క్షతగాత్రులను పోలీసులు ఐఐఈ-బీహెచ్‌యూ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు చెప్పారు. ఈ దుర్ఘటనపై కచ్చవాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ట్రక్కు, బస్సు ఢీ- 10మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆగస్టులో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదే జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. సేలంపుర్ ప్రాంతంలో బదాయూ - మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందినట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. మరో 27 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని మీరట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.