MH 60R Seahawk Helicopter Indian Navy : సముద్రంలో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, క్షిపణులను నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ సిద్ధం చేసిన MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వీటిని కేరళ కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్‌లో జరిగిన కార్యక్రమంలో కమిషన్ చేశారు నేవీ అధికారులు. చీఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో వీటిని నేవీలో భాగం చేశారు. MH 60R సీహాక్ మోడల్ తొలి హెలికాప్టర్‌ను కెప్టెన్ ఎమ్ అభిషేక్ రామ్ నడిపారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేవీల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం MH 60R సీహాక్ రాకతో మరింత పటిష్ఠంగా మారింది.
ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా అమెరికా నుంచి భారత్ 24 MH 60R సీహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2020 ఫిబ్రవరిలో భారత్ MH 60R సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ నేవీ. దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే శత్రు జలాంతర్గాములను నిమిషాల వ్యవధిలో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్ల సొంతం. అదే సమయంలో, ఈ హెలికాప్టర్లు శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటకు రాగలవు. సముద్రం కింద దాగి ఉన్న జలాంతర్గాములను, సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రు దేశపు నౌకలను గుర్తించి నిమిషాల వ్యవధిలో దాడి చేయగలవు.
MH 60R సీహాక్ హెలికాప్టర్ శత్రు యుద్ధనౌకలపై దాడిచేయడమే కాకుండా రెస్క్యూ ఆపరేషన్, సిబ్బంది రవాణా, వైద్య సామగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోల్డబుల్ రోటర్లు, టెయిల్ ఉండడం ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. అందువల్ల ఈ హెలికాప్టర్‌ను చిన్నపాటి ప్రదేశంలోనే పార్క్ చేయవచ్చు. చిన్న యుద్ధనౌకల్లో సులభంగా దీన్ని తరలించవచ్చు. డ్యూయల్ ఎంబెడెడ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా హెలికాప్టర్ కచ్చితమైన నావిగేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హెలికాప్టర్‌లో 38 లేజర్-గైడెడ్ రాకెట్‌లు, నాలుగు MK54 టార్పెడోలు, మెషిన్ గన్‌లు సముద్రంలో ఉన్న శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి.
MH 60R సీహాక్ హెలికాప్టర్ ముందు భాగంలోని ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణి కచ్చితమైన చిత్రాన్ని తీయగలవు. ఈ హెలికాప్టర్ ఒక ప్రాంతాన్ని స్కాన్ కూడా చేయగలదు. హెలికాప్టర్ గ్లాస్ కాక్‌పిట్ మల్టీపుల్ డిజిటల్ కాక్‌పిట్. ఇది రేయింబవళ్లు పనిచేస్తుంది. ఇందులో మిస్సైల్ వార్నింగ్ సిస్టమ్, లేజర్ వార్నింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ మిస్సైల్ జామింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ విమానం రక్షణ, యుద్ధరంగంలో ప్రభావం చూపగలదు.
ఐఎన్ఎస్ జటాయు!
మరోవైపు లక్షద్వీప్‌లోని మినికాయ్ ఐలాండ్‌లో ఐఎన్ఎస్ జటాయును కమిషన్ చేసింది భారత నేవీ. దీంతో ఎంతో కీలకమైన లక్షద్వీప్‌లో భద్రత మరింత పెరగనుంది. లక్షద్వీప్‌లో ఎంతో కాలంగా నేవీ వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ తెలిపారు. ఐఎన్ఎస్ జటాయు చేరికతో మరింత భద్రత, సౌకర్యాలు పెరుగుతాయని చెప్పారు.