Marriage Of Ghosts : ఎక్కడైనా వివాహ వయసు వచ్చిన కూతురికి పెళ్లి సంబంధాలను చూడడం సాధారణమే. మ్యారేజ్ బ్యూరో, పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా పెళ్లి కొడుకులను వెతుకుతుంటారు. కొన్నిసార్లు న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇస్తుంటారు. అయితే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ కుటుంబం 30 ఏళ్ల క్రితం మరణించిన తమ కుమార్తె(ఆత్మగా/ దెయ్యంగా ఉందని భావిస్తూ) కోసం పెళ్లి కుమారుడు(ఆత్మ/ దెయ్యం) కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరణించిన అమ్మాయికి పెళ్లి!
30 ఏళ్ల క్రితం మరణించిన తమ కుమార్తెతో, అదే కులానికి చెందిన చనిపోయిన వరుడు పెళ్లికి సిద్ధమైతే తమను సంప్రదించాలని ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ కొందరు మాత్రం ఈ వివాహం పట్ల ఆసక్తి చూపిస్తూ, సదరు ప్రకటన చేసిన కుటుంబాన్ని సంప్రదించారట కూడా.
తుళు ప్రజల ప్రగాఢ విశ్వాసం
ఈ ప్రకటన ఇతరులకు వింతగా అనిపించినప్పటికీ, తుళు ప్రజలకు దీనితో భావోద్వేగ సంబంధం ఉంది. పెళ్లికాని అమ్మాయి లేదా అబ్బాయి మరణిస్తే పుణ్యం రాదన్నది తుళు ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే వారు మరణించిన తర్వాత దెయ్యాల రూపంలో ఉంటారని భావించి వివాహం చేస్తారు. బతికున్న వారికి ఎలా పెళ్లిళ్లు చేస్తారో దెయ్యాలకు(ఆత్మలకు) అలాగే ఆడంబరంగా వివాహాలు జరిపిస్తారు. మృతుల కుటుంబీకులు దెయ్యాల పెళ్లిళ్లలో కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటారు. పెళ్లికాని యువతి లేదా యువకులు మరణిస్తే వారికి వివాహ వయసు రాగానే పెళ్లి జరిపిస్తారు. ఒకవేళ ఇలా విహహం చేయలేకపోతే, మృతుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతారట.
ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు
తుళు ప్రజలు దెయ్యాల వివాహాలను బతికున్న వాళ్ల పెళ్లిలాగే ఆడంబరంగా జరిపిస్తారు. వివాహ ఆచారాలను పాటిస్తారు. నిశ్చితార్థం, పెళ్లి కొడుకును చేయడం, సంప్రదాయ దుస్తులు, ఊరేగింపు ఇలా దెయ్యాల పెళ్లిని చాలా సంప్రదాయంగా చేస్తారు. పెళ్లికి వచ్చిన అతిథులకు భోజనం పెడతారు. అయితే ఎక్కువగా దెయ్యాల వివాహాలు ఆషాఢ మాసం రాత్రి వేళల్లో జరిపిస్తుంటారు.
లోక్సభ నాలుగో దశ ఎన్నికలు- 67.70శాతం ఓటింగ్ నమోదు - LOK SABHA POLLS 2024