Mamata Banerjee on Kultali Girl Death : బంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన మరవక ముందే ఓ బాలికపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది. కోచింగ్ సెంటర్‌కు వెళ్లి అదృశ్యమైన బాలిక శవమై కనిపించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితుడిపై ఫోక్స్ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. నేరస్థుడికి మరణ శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
'నేరానికి కులం, రంగు, ప్రాంతం అనే తేడా ఏమి ఉండదు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యుల తీసుకోవాలి. పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేయాలని నేను పోలీసులను ఆదేశించా. మూడు నెలల్లోగా అతడికి మరణ శిక్ష అమలు చేయాలని కోరుతున్నా. అయితే అత్యాచార కేసుల్లో మీడియా ట్రయల్స్‌పై అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన మమతా దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తాయన్నారు.
ఇదీ జరిగింది
బంగాల్లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఓ బాలిక శుక్రవారం కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయినా తిరిగి రాకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటినిండా గాయాలతో ఆమె మృతదేహం పొలంలో లభ్యమైంది. ఈ ఘటన ఆ గ్రామస్థుల్లో ఆగ్రహ జ్వాలల చెలరేగాయి. కర్రలతో వచ్చి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అవుట్ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.
ప్రతిఘటించినందుకే హత్య
పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు మోస్తకిన్ సర్దార్(19) బాలికను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం వల్ల చంపేసి కాలువలో పడేసినట్లుగా నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి కొద్ది రోజుల ముందు నుంచి నిందితుడు బాలిక స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఐస్ క్రీంలు ఇస్తూ పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా సైకిల్‌పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లాడని పేర్కొన్నారు.
మరోవైపు మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే సీఎం మమతా బెనర్జీ తాజాగా స్పందించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.