EC Invites Congress : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ రాసిన లేఖకు ఎన్నికల సంఘం స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న రావాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆహ్వానించింది. ఎన్నికలు ప్రతిదశలోనూ పారదర్శకంగా జరిగాయని తెలిపింది. చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇవ్వనున్నట్లు ఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిన్న లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ, ఆధారాలు చూపేందుకు అపాయింట్‌మెంటు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఈసీ సానుకూలంగా స్పందించింది.
"మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయి. కానీ దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. వారి చట్టపరమైన ఆందోళనలను మేం పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తాం" అంటూ కాంగ్రెస్ పార్టీ బృందాన్ని ఈసీ ఆహ్వానించింది.
మహాయుతి భారీ విజయం
ఇటీవల వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సాధించింది. భాజపా 132 సీట్లు సొంతం చేసుకోగా, శిందే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్‌సీపీకి 41 సీట్లు దక్కాయి. విపక్ష మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్‌కు కేవలం 16 సీట్లు రాగా, శివసేన(యూబీటీ) 20, ఎన్‌సీపీ(ఎస్‌పీ) 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి. దీనితో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఈవీఎంల్లో మానిప్యులేషన్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.