Maharashtra Assembly Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు. మొత్తంగా ఆరు పార్టీలకు ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్), కాంగ్రెస్‌కు ఇది అగ్ని పరీక్షే. చీలిక రాజకీయాలకు, మరాఠా కోటా రిజర్వేషన్ల అంశానికి, ప్రతిపక్ష పోరాటానికి ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, దశాబ్దాలుగా తమ పార్టీల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికారిక హోదాను దక్కించుకున్న ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్‌లకూ కీలకంగా నిలవనున్నాయి. గత ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీకి, గతంలో సుదీర్ఘ కాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమనే చెప్పాలి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహాయుతి, శివసేన (ఉద్ధవ్), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్‌పీ) ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మధ్యే సాగనున్నాయి. రెండు కూటములు ఇంకా సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 30 సీట్లను గెలుచుకుని ఎంవీఏ మంచి ఫలితాలను సాధించింది. బీజేపీ కూటమి కేవలం 17 సీట్లలోనే విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇందులో రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
గత ఐదేళ్లలో ఎన్నో పరిణామాలు!
మహారాష్ట్ర రాజకీయాల్లో గడచిన ఐదేళ్లలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు దక్కాయి. ఎన్సీపీ 44, కాంగ్రెస్ 54 సీట్లలో గెలిచాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల సిద్ధాంతపరంగా తన బద్ధ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టు కట్టింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత 2022లో శివసేన నేత ఏక్‌నాథ్ శిందే అనూహ్యంగా పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టారు. కాషాయ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది ఎన్సీపీలోనూ చీలిక వచ్చింది. శరద్ పవార్‌తో విభేదించి అజిత్ పవార్ మహాయుతి కూటమిలో 40 మంది ఎమ్మెల్యేలతో చేరారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల మహాకూటమి బలం ప్రస్తుతం 162 కాగా, మహావికాస్ అఘాడీ కూటమికి 105 సీట్ల బలం ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో తమవే అసలైన శివసేన, ఎన్సీపీ అని శిందే, అజిత్ పవార్ అసెంబ్లీలో నిరూపించుకున్నా, ప్రజా కోర్టులో ఎవరికి మద్దతుందనేది ఇప్పుడు తేలనుంది.