Madhya Pradesh Accident Today : మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. దిండోరీలోని బంద్ఝర్ ఘాట్ ప్రాంతంలో ఓ పికప్ వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గురువారం తెల్లవారుజాముకు ముందు 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులంతా జిల్లాలోని షాపురా బ్లాక్లో ఉన్న అమ్హాయి దేవ్రీ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారని చెప్పారు. సీమంతం వేడుకకు హాజరై తమ స్వగ్రామానికి వీరంతా వెళ్తున్నట్లు చెప్పారు. షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం తరలించినట్లు తెలిపారు.
సీఎం విచారం- మృతుల కుటుంబాలకు పరిహారం
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో 8 చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు. యాత్రికులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ చెరువులో పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. వీరంతా హరిద్వార్ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు సమాచారం అందుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో గాయపడిన నలుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ ట్రాలీలో 35-40 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.
మాఘ పూర్ణిమను పురస్కరించుకుని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. మార్గమధ్యలో గధయ్య గ్రామ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడిందని వివరించారు. అందులో ఉన్న కొంత మంది ఈదుకుంటూ రోడ్డుకు చేరుకుని, స్థానికులను సహాయం కోరారు. కొందరు స్థానికులు స్పందించి పలువురిని కాపాడారు.