Loksabha Elections Congress Second List : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ- తాజాగా మరో 43 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, దమన్‌దీవ్ పరిధిలోని పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ జాబితాలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారుల పేర్లు ఉన్నాయి.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ ఛింద్వాడా నుంచి పోటీ చేయనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్‌ను జాలోర్ నుంచి ఆ పార్టీ బరిలోకి దింపింది. అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్ తనయుడు జోర్హాట్ నుంచి పోటీ చేయనున్నారు. గతంలో కలియాబోర్ స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. 43 మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
'పోరాడి గెలవడానికి ప్రయత్నిస్తా'
లోక్‌సభ ఎన్నికలకు రెండో జాబితాలో స్థానం సంపాదించడం పట్ల ఎంపీ, జోర్హాట్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ సంతోషం వ్యక్తం చేశారు. "నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నికల్లో పూర్తిశక్తితో పోరాడి గెలవడానికి ప్రయత్నిస్తాను. జాబితా ఇప్పుడు ఫైనల్ అయినందున అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తాం" అని తెలిపారు.
-
#WATCH | On being announced as a candidate from Assam's Jorhat for the upcoming Lok Sabha elections, Congress MP Gaurav Gogoi says "I want to thank the central leadership of Congress party for giving me this responsibility. We will fight the elections with full strength and try… pic.twitter.com/ibgCJXEEQ9
— ANI (@ANI) March 12, 2024
Loksabha Election 2024 Congress First List : అంతకుముందు 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఉన్నారు. ఈ తొలి జాబితాలో ప్రకటించిన 39 మందిలో 15 మంది జనరల్, 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నారు.