Lok Sabha Speaker 2024: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ జమ్ముకశ్మీర్‌కు చెందిన ఎంపీతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ తీర్మానం ప్రతిపాదించగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బలపరిచారు. ఆ తర్వాత మరికొందరు మంత్రులతోపాటు ఎన్డీయేకు చెందిన ఎంపీలు ఓం బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు.
ఆ తర్వాత ఇండియా కూటమి తరఫున కె.సురేశ్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా మరికొందరు బలపరిచారు. అనంతరం మూజువాణి ఓటుతో 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఓం బిర్లా స్థానం వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఓంబిర్లాపై ప్రశంసలు కురిపించారు.
కాగా, వరుసగా రెండోసారి స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఓం బిర్లాపై ప్రధాని మోదీ ప్రసంసల జల్లు కురిపించారు. ఆయన పార్లమెంట్ సభ్యులకు మార్గనిర్దేశం చేస్తూ సభలో పెద్దన్న పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 'రెండోసారి ఈ పీఠాన్ని దక్కించుకున్న మీకు సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు. గతంలో బలరాం ఝక్కడ్ తర్వాత వరుసగా రెండోసారి స్పీకర్ పదవి చేపట్టే అవకాశం మీకు వచ్చింది. వచ్చే 5 ఏళ్లు సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారన్న విశ్వాసం ఉంది. దేశ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు ఈ సభ తన బాధ్యతను నిర్వహించటంలో మీ పాత్ర ఎక్కువగా ఉండనుంది' అని మోదీ అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany Lok Sabha Speaker Om Birla to the chair. pic.twitter.com/3JfKbCH3nC
— ANI (@ANI) June 26, 2024
అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఇండియా కూటమి తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'స్పీకర్ ఎన్నికలో విజయం సాధించిన మీకు ఇండియా కూటమి తరఫున శుభాకాంక్షలు. ప్రతిపక్షంగా భారత ప్రజల స్వరాన్ని సభలో వినిపిస్తాం. అలాగే సభలో విపక్షాలు మాట్లాడేందుకు మీరు అనుమతిస్తారన్న నమ్మకం మాకు ఉంది. దేశ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను మీరు నిర్వహించాలి' అని రాహుల్ గాంధీ అన్నారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్ కోటా స్థానం నుంచి ఓం బిర్లా ఎంపీగా విజయం సాధించారు.
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- ప్రధాని మోదీ, రాహుల్ అభినందనలు - Parliament Session 2024
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్- ప్రొటెం స్పీకర్‌కు సోనియా గాంధీ లేఖ - Rahul Gandhi Loksabha 2024