Lok Sabha Polls Secret Agents : సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీలతోపాటు నాయకులకు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్న నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలోనే నాయకుల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ పరీక్షలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులే ఈ కన్సల్టెన్సీల్లో పని చేస్తున్నారు.
పార్టీలకు తగ్గట్లుగా వ్యూహాలు!
ఐఐటియన్లు, ఎంబీఏ పట్టభద్రులతోపాటు యువ న్యాయవాదులు తెర వెనుక ప్రచార వ్యూహాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరు సర్వేలు నిర్వహించడం, ఓటర్ల డేటాను విశ్లేషించడం వంటి పనులు చేస్తుంటారు. పార్టీలకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తుంటారు. వీరికి క్షేత్ర స్థాయిలో పని చేసే వందల మంది సహకరిస్తుంటారు. వారంతా ఓటర్ల అభిప్రాయం, సమస్యలను కేంద్రానికి చేరవేస్తుంటారు.
ఫలానా డిగ్రీ ఉండాలని కోరుకోవు!
నిగూఢ సైన్యంగా పనిచేసేవారికి ఎన్నికల సమయంలో కన్సల్టెన్సీలు ఫలానా డిగ్రీ ఉండాలని కోరుకోవు. కానీ గణితంలో ప్రతిభ ఉండాలని కోరుకుంటాయి. కోడింగ్‌లో నైపుణ్యంతోపాటు సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉందోలేదో చూస్తాయి. ఐఐఎంలో చదివిన వారిని టీమ్‌లకు నాయకత్వం వహించడానికి, ఐఐటీల వారిని టెక్నాలజీలో వినియోగించుకోవడానికి సంస్థలు తీసుకుంటున్నాయి. కచ్చితంగా వారంతా నిగూఢంగా 24 గంటలు కూడా పని చేయాల్సి ఉంటుంది.
30 కోట్ల డాలర్ల మార్కెట్!
దేశంలో ఎన్నికల వ్యూహ రచన కన్సల్టెన్సీల మార్కెట్ 30 కోట్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ పార్టీలు కన్సెల్టెన్సీలను తప్పనిసరిగా తీసుకుంటున్నాయి. కన్సల్టెన్సీలు కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థల్లో చదివిన వారిని ఆకట్టుకునేందుకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతోపాటు అధికార వ్యవస్థలకు దగ్గరగా ఉండే అవకాశం కూడా పట్టభద్రులను ఆకర్షిస్తోంది.
ప్రతి ఓటుపైనా దృష్టి
చెప్పాలంటే కన్సల్టెన్సీల్లో పని చేసే ఉద్యోగులు ప్రతి ఓటుపైన కూడా దృష్టి సారిస్తారు. ఉదాహరణకు త్రిపురలోని కొండ ప్రాంతాల్లో ఉండే 80 మంది ఓటర్లను కలుసుకోవడానికి ఒక ఉద్యోగి 3 రోజుల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చేసి ఆ ఓట్లను సాధించగలిగారు. అయితే నిగూఢ సైన్యానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. వారికి కావాల్సిందల్లా వేతనమే. అందుకే వారిని రాజకీయ తటస్థ సమస్య సాధకులు అని పిలుస్తంటారు.
VVPATలు ఎలా పని చేస్తాయి? ధర ఎంత? తొలిసారి ఎప్పుడు వినియోగించారు? - VVPAT Working Model