Lk Advani Political Career : రాజకీయ దిగ్గజం ఎల్కే అడ్వాణీ జనతా పార్టీ నుంచి బీజేపీ ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేశారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన అనేక కీలక నిర్ణయాలు, పథకాల్లో భాగస్వాములయ్యారు. అనేక సందర్భాల్లో నాటి ప్రధాని వాజ్‌పేయీకి కుడి భుజంలా నిలిచి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పై జనతా పార్టీ విజయం సాధించి కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ కేబినెట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు అడ్వాణీ కూడా స్థానం దక్కించుకున్నారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అడ్వాణీని పిలిచి ఏ శాఖ కావాలని అడగ్గా అప్పటికే జర్నలిస్టుగా పనిచేసిన ఆయన ఎలాంటి సంకోచం లేకుండా తనకు సమాచార, ప్రసార శాఖ కావాలని చెప్పారట. ఆయన కోరినట్లుగానే సమాచార, ప్రసార శాఖను మొరార్జీ దేశాయ్ కట్టబెట్టారు. 1977-1979 వరకు అడ్వాణీ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు.
హోంమంత్రిగా కీలక బాధ్యతలు
1998లో జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది. అప్పుడు అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పటి వాజ్‌పేయీ సర్కార్ నిర్వహించిన అణు పరీక్షలు భారత్‌ను అణ్వస్త్ర దేశాల సరసన చేర్చాయి. ఈ మొత్తం ప్రక్రియను నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ముందుకు తీసుకెళ్లగా అప్పటి హోం మంత్రిగా మొత్తం తతంగాన్ని అడ్వాణీ నడిపించారు. అమెరికా నిఘా సంస్థ సీఐఏ నిఘా ఉపగ్రహాలకు చిక్కకుండా పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించడంలో విజయవంతమయ్యారు. అణు పరీక్షలు నిర్వహించిన విషయాన్ని వాజ్‌పేయీ సర్కార్ ప్రకటించే వరకు ప్రపంచ దేశాలకు తెలియదంటే అందుకు అడ్వాణీనే కారణం. సైన్యాన్ని, శాస్త్రవేత్తలను సమన్వయం చేసుకుంటూ తగిన రహస్య తతంగాన్ని నాటి హోంమంత్రిగా అడ్వాణీనే నడిపారు. వాజ్‌పేయీ పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నారు.
అణు పరీక్షల కారణంగా ప్రపంచ దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించగా నాటి ప్రతిపక్షాలు వాజ్‌పేయీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయినప్పటికీ వాజ్‌పేయీ వెనక్కి తగ్గలేదంటే అడ్వాణీ సహా సహచర మంత్రులు ఇచ్చిన మద్దతేకారణం. అయితే జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవటం వల్ల ఎన్డీఏ సర్కార్ ఏడాదికే కుప్పకూలినా తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడానికి వాజ్‌పేయితో పాటు అడ్వాణీ కూడా ఎంతో శ్రమించారు.
'అపరేషన్ విజయ్'లో కీలక పాత్ర
1999లో మరోసారి వాజ్‌పేయీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా అడ్వాణీ బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు. 1999 మే 3 నుంచి జులై 26 వరకు కార్గిల్ పోరు జరిగినప్పుడు అడ్వాణీ హోంమంత్రిగా పనిచేశారు. నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, వారికి సహకరించిన పాక్ సైనికులను తరిమికొట్టేందుకు వాజ్‌పేయీ సర్కార్ నిర్వహించిన 'ఆపరేషన్ విజయ్' కార్యక్రమాన్ని అడ్వాణీ, నాటి రక్షణ మంత్రితో కలిసి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సమయంలో అడ్వాణీపై కొన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోకుండా ఆపరేషన్ విజయ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. వాజ్‌పేయీ అప్పగించిన బాధ్యతలను సమర్థమంతంగా అడ్వాణీ నిర్వర్తించారు.
విదేశీ పర్యటనలు
హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా 2001 నుంచి 2003 మధ్య జర్మనీ, టర్కీ, యూఏఈ, ఖతార్, అమెరికా, స్పెయిన్, సింగ్‌పూర్ దేశాల్లో అడ్వాణీ పర్యటించారు. ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం కృషి చేశారు. 2002, 2003లోనూ అగ్ర రాజ్యంలో అడ్వాణీ పర్యటించారు.
కరడుగట్టిన దేశ భక్తుడు- అడ్వాణీ ఎప్పటికీ భారతరత్నమే!
రథయాత్రికుడిగా అడ్వాణీ- 6యాత్రలతో దేశరాజకీయ చరిత్రలో సువర్ణాధ్యాయం!