Lawyers Letter To CJI : రాజకీయ ఒత్తిళ్ల వల్ల న్యాయవ్యవస్థకు పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేశంలోని దాదాపు 600 మంది లేఖ రాశారు. కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి ఒత్తిడి వ్యూహాలను ప్రయోగిస్తున్న స్వార్థ ప్రయోజనాల సమూహం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు తమ సంతకాలతో ఓ లేఖను రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన ప్రముఖ న్యాయవాదుల్లో హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిత్తల్, పింకీ ఆనంద్, స్వరూపమ చతుర్వేది తదితరులు ఉన్నారు.
రాజకీయ అజెండాలతో న్యాయవ్యవస్థకు ముప్పు
ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. వారి చర్యల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు న్యాయ ప్రక్రియలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ముప్పు వాటిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పనితీరును కించపరిచేలా 'స్వర్ణ యుగం', 'బెంచ్ ఫిక్సింగ్' లాంటి పదాలను కొందరు వెటకారంగా అర్ధం వచ్చేలా ప్రయోగిస్తున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అజెండాతో న్యాయస్థానాలను అగౌరవపరిచే ఇలాంటి పదజాలాన్ని ప్రయోగించే వారిని ఉపేక్షించకూడదని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డదిడ్డమైన ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టులను ప్రభావితం చేయడం సులభం అంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని 600 మంది లాయర్లు తమ లేఖలో పేర్కొన్నారు.
కోర్టు నిర్ణయాలు అనుకూలంగా లేకపోతే విమర్శలు
'రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేస్తారు. ఆ తర్వాత వారనే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు' అని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభంగా ఉండేలా న్యాయవ్యవస్థను నిలపాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
న్యాయవాదుల లేఖపై మోదీ
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మందికి పైగా న్యాయవాదులు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇతరులను బుజ్జగించడం, వేధించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు తీసేందుకు స్వార్థ ప్రయోజనాల బృందం ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు.
"ఇతరులను బుజ్జగించడం, బెదిరించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి. ఐదు దశాబ్దాల క్రితమే వారు 'కమిటెడ్ జ్యుడీషియరీ' కోసం పిలుపునిచ్చారు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను సిగ్గులేకుండా కోరుకుంటారు. కానీ దేశం పట్ల నిబద్ధతకు దూరంగా ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయులు వారిని తిరస్కరిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు" అని మోదీ పోస్ట్ చేశారు.
టికెట్ ఇవ్వలేదని మనస్తాపం!- పురుగుల మందు మింగి ఎంపీ ఆత్మహత్య - Erode MP Ganeshamurthi Death