Kolkata Doctor Rape Murder Case : కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన వైద్య విద్యార్థులు ఎట్టకేలకు 41 రోజుల తర్వాత తమ ఆందోళన విరమించారు. శనివారం నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన రెండు సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం సీఎం మమతా బెనర్జీ నివాసంలో జూనియర్ వైద్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన పలు డిమాండ్లకు మమత బెనర్జీ అంగీకరించారు. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్‌లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్‌తో వైద్య విద్యార్థులు బుధవారం సమావేశమయ్యారు.
హామీలు అమలు కాకపోతే!
తమ డిమాండ్లలో అధిక శాతానికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని గురువారం ప్రకటించారు. అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. అయితే కోల్‌కతాలోని స్వాస్థ్య భవన్ ఎదుట నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని తెలిపారు. కానీ దానికి ముందు నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ అమలుకాకపోతే తిరిగి విధులను బహిష్కస్తామని హెచ్చరించారు.
"మా ఆందోళన విరమిస్తున్నాం. ఈ కేసును త్వరగా విచారించేందుకు రేపు మధ్యాహ్నం సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపట్టనున్నాం. వరదల నేపథ్యంలో రోగులకు వైద్యం అందించడానికి శనివారం నుంచి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నాం. అత్యవసర సేవల్లో పాల్గొంటాం. అయితే కోల్‌కతాలోని వైద్య కళాశాలలు అన్నింటి వద్ద ధర్నా మంచాస్ అలాగే కొనసాగుతాయి" అని ఓ డాక్టర్ అన్నారు.
మాజీ ప్రిన్సిపల్ రిజిస్ట్రేషన్ రద్దు
ఆర్‌జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను బంగాల్ వైద్య మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన్ను డబ్ల్యూబీఎంసీ నిర్వహించే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్‌ల జాబితా నుంచి తొలగించినట్లు గురువారం సంబంధిత అధికారులు వెల్లడించారు. 1914 బెంగాల్ వైద్య చట్టం కింద సందీప్ ఘోష్ మెడికల్ లైసెన్సును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
'బంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం'- సీబీఐ ఆరోపణలు - Bengal Doctor Rape Case Updates
కోల్‌కతా డాక్టర్ కేసుపై సుప్రీం విచారణ- మహిళా న్యాయవాదుల భద్రతకు హామీ - Kolkata Doctor Case