Kolkata Doctor Case : బంగాల్‌లోని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన ప్రస్తుతం దేశమంతటా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖులు మాట్లాడగా, తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. దీంతో ఆ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు.
"గత వారం నేను చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మరికొందరైతే దాన్ని వక్రీకరించారు. ఏదేమైనప్పటికీ జరిగిన ఘటన చాలా దారుణమైనది. దీనిపై సీబీఐ, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ చర్యకు పాల్పడిన నేరస్థుడెవరో తేలిపోతుందని ఆశిస్తున్నాను. అతడికి విధించే శిక్ష చాలా కఠినంగా ఉండాలి. అదెలా ఉండాలంటే, భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడేందుకు సాహసం కూడా చేయకూడదు. శిక్ష అంత తీవ్రంగా ఉండాలి" అంటూ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
42 మంది వైద్యుల బదిలీ
అయితే కోల్‌కతా ట్రెయినీ డాక్టర్ మర్డర్ కేసు నేపథ్యంలో బంగాల్ ప్రభుత్వం, రాష్ట్రంలోని 42 మంది డాక్టర్లను బదిలీ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ నేత అమిత్ మాళవీయ, జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా ఖండించారు. ఇది డాక్టర్లపై ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత, బెదిరింపు చర్య అంటూ పేర్కొన్నారు.
'జుడాలు ఇక సమ్మె విరమించండి'
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన తెలుపుతూ భారత వైద్య సంఘం (ఐఎంఏ) తాజాగా సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఆస్పత్రులలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తక్షణమే ఈ సమ్మెను విరమించాలంటూ ప్రభుత్వం జుడాలను కోరింది. వారి కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది. అలాగే వైద్యవృత్తిలో ఉన్నవారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది.