Kerala Private Train Service : దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ జూన్ 4న కేరళలో ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా తిరువనంతపురం నుంచి గోవాకు రాకపోకలు ప్రారంభించనుంది. దీని ప్రధాన లక్ష్యం పర్యాటకులు. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఎస్‌ఆర్ఎంపీఆర్(SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రైవేటు రైలు సర్వీసును నిర్వహించనుంది.
కేరళలో పర్యాటకానికి కొత్తరెక్కలు తొడిగే సంకల్పంతో ఒక రైలును ఎస్‌ఆర్ఎంపీఆర్ లీజుకు తీసుకుందని ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ డైరెక్టర్ దేవికా మీనన్ వెల్లడించారు. రైలును, దానిలోని సౌకర్యాలను ఎస్‌ఆర్ఎంపీఆర్ నిర్వహిస్తుండగా, ఆ ట్రైనుకు సంబంధించిన టికెటింగ్, మార్కెటింగ్ బాధ్యతలను ప్రిన్సి ట్రావెల్స్ పర్యవేక్షిస్తోందన్నారు. తొలి విడతగా ఈ రైలు తిరువనంతపురం నుంచి గోవా వరకు రాకపోకలు సాగిస్తుంది. ఈ రూట్‌లో త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ సహా పలు స్టేషన్‌లలో రైలు హాల్టింగ్స్ ఉన్నాయి. తదుపరిగా ముంబై, అయోధ్య రూట్‌లోనూ ఈ ప్రైవేటు ట్రైన్‌ను నడపాలని ప్లాన్ చేస్తున్నారు.
రైలు కెపాసిటీ 750 సీట్లు
ఈ ప్రైవేటు ట్రైన్లో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయొచ్చు. ఇందులో 2 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వైద్య నిపుణులు సహా మొత్తం 60 మంది సిబ్బంది ట్రైన్లో అందుబాటులో ఉంటారు. ఈ రైలులో భోజన వసతి, వైఫై కనెక్టివిటీ, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. స్టార్ హోటల్ వసతి, భోజన సదుపాయంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించే టూర్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు.
ట్రైన్ ఛార్జీలు
ఈ రైలులోని నాన్-ఏసీ స్లీపర్ బోగీలో గోవాకు 4 రోజుల పర్యటన కోసం టికెట్ ఛార్జీగా రూ.13,999 వసూలు చేస్తారు. త్రీ టైర్ ఏసీ కోచ్‌లో సీటు బుక్ చేసుకునేందుకు రూ.15,150; టూ టైర్ ఏసీ కోచ్‌లో సీటు బుక్ చేసుకునేందుకు రూ.16,400 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మూడు రకాల కోచ్‌లకు సంబంధించిన టికెట్ల రేట్లు - ముంబయి రూట్‌లో రూ.15,050(నాన్ ఏసీ స్లీపర్), రూ.16,920 (త్రీ టైర్ ఏసీ), రూ. 18,825 (టూ టైర్ ఏసీ) చొప్పున ఉంటాయి.
అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 8 రోజుల పాటు సాగే టూర్ ప్యాకేజీ రేట్లు వరుసగా రూ.30,550 (స్లీపర్ నాన్ ఏసీ), రూ.33,850 (త్రీ టైర్ ఏసీ), రూ.37,150గా (టూ టైర్ ఏసీ) ఉంటాయి. ఇక 5 ఏళ్లలోపు పిల్లలు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. 5 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు సగం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది.