Kerala BJP Leader Murder case : కేరళలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీజేపీ నేత హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణ శిక్ష విధించింది ఓ న్యాయస్థాం. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వ్యక్తులకు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. అలప్పుళలోని మావేళిక్కర అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి వీజీ శ్రీదేవీ ఈ మేరకు తీర్పు చదివారు.
2021 డిసెంబరు 19న అలప్పుళలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్యకు గురయ్యారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే అత్యంత పాశవికంగా హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా 156 మంది సాక్షులను పోలీసులు విచారించారు. వందలాది ఆధారాలు, వేలి ముద్రలు, శాస్త్రీయ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును ఛేదించారు. నిందితుల గూగుల్ రూట్ మ్యాప్‌లు కేసులో కీలక ఆధారంగా నిలిచినట్లు సమాచారం. విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలతో నిందితులందరికీ మానసిక పరీక్షలు సైతం నిర్వహించారు. అలప్పుళ డిప్యూటీ ఎస్పీ ఎన్ఆర్ జయరాజ్ కేసు విచారణను పూర్తి చేసి ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 15 మందిని దోషులుగా తేల్చింది.
దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. దోషులంతా హత్యలు చేయడానికి శిక్షణ పొందిన బృందం సభ్యులు అని తెలిపింది. తల్లి, భార్య, పిల్లల ఎదుటే రంజిత్‌ను దారుణంగా చంపేశారని, అత్యంత అరుదైన నేరంగా పరిగణించి శిక్ష విధించాలని కోరింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం వారికి మరణ శిక్ష విధించింది. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెంగన్నూర్, కాయంకులం డిప్యూటీ ఎస్పీలు భద్రతను పర్యవేక్షించారు.
గంటల్లోనే ఇద్దరు నాయకుల హత్య
కాగా, 2021 డిసెంబర్ 18న ఎస్డీపీఐ నాయకుడు కేఎస్ షాన్ హత్యకు గురయ్యాడు. ఇంటికి తిరిగి వస్తుండగా షాన్‌ను ఓ ముఠా చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్ హత్యకు గురవ్వడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.
సీఎం కార్లు సీజ్ చేసిన ఈడీ- సోదాల్లో రూ.36లక్షలు స్వాధీనం- భార్యకు పగ్గాలు!