Kejriwal ED News Today : మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం, సోమవారం ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా తాను హాజరుకావడం లేదని సీఎం కేజ్రీవాల్ సమాచారమిచ్చారు.
'ఈడీ సమన్లు చట్టవిరుద్ధం'
అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. సమన్ల చెల్లుబాటు అంశం కోర్టులో ఉందని చెప్పాయి. దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని తెలిపాయి. ఈడీ అధికారులు మళ్లీ మళ్లీ సమన్లు పంపే బదులు న్యాయస్థానం నిర్ణయం కోసం వేచిచూడాలని పేర్కొన్నాయి. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు గతేడాది నవంబరు 2, డిసెంబరు 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు పంపింది. కానీ ఆయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు.
సీఎం స్పందించలేదని కోర్టుకు ఈడీ
మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం జారీ చేసిన నోటీసులకు సీఎం కేజ్రీవాల్ స్పందించకపోవడం వల్ల ఈడీ ఇటీవలే కోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న న్యాయస్థానం ఇటీవలే కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో గత శనివారం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ రోజున విశ్వాస పరీక్ష ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
అయితే తదుపరి విచారణకు హాజరవుతానని కోర్టులకు కేజ్రీ అభ్యర్థించారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులో కూడా సమన్లు అందాయి. ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు.
'2029లో బీజేపీ ముక్త భారత్- ఆ పార్టీని ఓడించేది మేమే- అందుకే వారికి భయం'
'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్!