Arvind Kejriwal Case : మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈడీ పిటిషన్‌పై రెండు మూడు రోజుల్లో తీర్పు వెలువరించనున్నట్లు శుక్రవారం తెలిపింది.
సోమవారం లేదా మంగళవారం!
"ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. రాబోయే రెండు రోజుల్లో రాతపూర్వకంగా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలని కోరింది. సోమవారం లేదా మంగళవారం స్టే ఆర్డర్‌పై తన తీర్పును వెలువరించనుంది" అని ఆప్ లీగల్ సెల్ హెడ్, న్యాయవాది సంజీవ్ నాసియర్ మీడియాకు తెలిపారు.
అయితే కేజ్రీవాల్‌కు గురువారం సాయంత్రం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ను విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసింది. దిగువ న్యాయస్థానం తమ వాదనలు పూర్తిగా వినలేదని పేర్కొంది. ఆ తర్వాత కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే విధించి, ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు.
ఈడీ కోర్టుకెలా వెళ్లింది?: సునీత కేజ్రీవాల్
మరోవైపు, ఈడీ తీరుపై సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకముందే ఈడీ ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని అసహనం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధించింది.
ఆప్ అంతం చేయడమే బీజేపీ లక్ష్యం- భయంతో 'ఆపరేషన్ ఝాడు': కేజ్రీవాల్ - AAP Leaders Protest