Kavali Road Accident Today at Musunuru Toll Plaza: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. శనివారం తెల్లవారుజామున కావలి వద్ద రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముసునూరు టోల్ ప్లాజా వద్ద గేదెల లోడుతో ఆగి ఉన్న లారీని, మరో లారీ వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆగి ఉన్న లారీ బోల్తా పడింది. వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్ అవతలి వైపు వస్తున్న ప్రైవేటు బస్సును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో అక్కడ భీకర ప్రమాద వాతావరణం నెలకొంది. ప్రమాద సమయంలో ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నట్లు వివరించారు.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 12మందికి గాయాలు
బస్సులో ఉన్న ప్రయాణికులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోగా ప్రమాదం జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద దాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంలో మృతులతో పాటు మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చినగంజాం జాతీయ రహదారిపై ప్రమాదం - యువకుడు మృతి
ప్రమాద సమాచారం తెలిసినా వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదం సంభవించడంతో నెల్లూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో చాలా సేపు వాహనాలు నిలిచిపోయాయని పోలీసులు వివరించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొంత మంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు వెల్లడించారు.
"ఒక్కసారిగా బస్సులో శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డాము. ఏమైందో తెలుసుకునే లోపు అందరం కిందపడిపోయాము. కొంతసేపటి వరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు." - ప్రయాణికుడు
వేములపాడు ఘాట్‌రోడ్డుపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ - 13 మందికి గాయాలు