Karnataka Road Accident : కారులో బామ్మ మృతదేహాన్ని తీసుకెళ్తుండగా టైరు పేలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది.
అసలేం జరిగిందంటే?
సురేశ్ అనే యువకుడి బామ్మ హులిగమ్మ(66) అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హులిగమ్మ మృతదేహాన్ని ఆమె మనవడు సురేశ్ కారులో స్వగ్రామానికి తీసుకొస్తుండగా రాంపుర్ సమీపంలోని గ్రాండ్ హోటల్ వద్ద టైరు పేలిపోయింది. దీంతో కారు బోల్తా కొట్టింది. అప్పుడు కారులో ఉన్న సురేశ్ (40), మల్లికార్జున (25), భూమిక (9) మృతి చెందారు. నాగమ్మ (31), తాయమ్మ (56), ధనరాజ్ (39), కారు డ్రైవర్ శివ (26) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుల్ని వైద్యం కోసం రాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా సిరుగుప్పకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
బామ్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదంలో మనవడు సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. దీంతో సిరుగుప్ప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గోడను ఢీకొట్టిన వ్యాన్
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేతుబావచత్రం వద్ద వ్యాన్ గోడను ఢీకొనడం వల్ల శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
11 మందితో ట్యుటికోరిన్ నుంచి వేలంకణి వైపు వెళ్తున్న వెళ్తున్న వ్యాన్ శనివారం వేకువజామున సేతుబావచత్రంలోని ఓ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను తంజావూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం పట్టుకోట్టైలోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాలువలో పడిపోయిన కారు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో వేగంగా వెళ్తున్న కారు కాలువలో పడిపోయిన ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు ఆగ్రాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.