How To Make Curry Leaves Chutney : మనం డైలీ చేసుకునే వివిధ వంటకాల్లో తప్పనిసరిగా ఉండే వాటిల్లో ఒకటి.. కరివేపాకు(Curry Leaves). ఇది వంటలకు కమ్మని రుచి, వాసనను అందించి అదనపు టేస్ట్‌ను తీసుకొస్తుంది. అలాగే ఈ ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అయితే, దీన్ని వంటలలో వేసుకోవడం మాత్రమే కాదు.. ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని తిన్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా "కరివేపాకు చట్నీ"ని ప్రిపేర్ చేసుకోవచ్చు! దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అద్దిరిపోతుంది! పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంతకీ, ఈ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- కరివేపాకు - 2 కప్పులు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- మినపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు - అర టేబుల్‌స్పూన్
- మెంతులు - పావు టీస్పూన్
- ఎండుమిర్చి - 10
- జీలకర్ర - 1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 8
- చింతపండు - కొద్దిగా
- తాలింపు గింజలు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెండు కప్పుల కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన చింతపండును వేడినీళ్లలో నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కరివేపాకును బాగా ఫ్రై చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఆ తర్వాత అదే పాన్‌లో.. మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు ఎండుమిర్చి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోరగా వేయించుకోవాలి.
- అయితే, ఇక్కడ మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లార్చుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి మిశ్రమం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఆపై అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి రుబ్బుకోవాలి.
- ఆవిధంగా మిక్సీ పట్టుకున్నాక.. ఆ మిశ్రమంలోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని నీటితో సహా వేసుకొని చట్నీ కాస్త బరకగా ఉండేలా మళ్లీ బ్లెండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం తాలింపు మిశ్రమాన్ని ముందుగా రుబ్బిపెట్టుకున్న కరివేపాకు పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే 'కరివేపాకు చట్నీ' మీ ముందు ఉంటుంది!
ఇవీ చదవండి :
నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు!
ఆంధ్రా స్టైల్లో చికెన్ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్ట్!