Jyotiraditya Scindia Fate In Guna : సార్వత్రిక ఎన్నికల సమరంలో గ్వాలియర్ రాజ కుటుంబానికి కంచుకోటగా ఉన్న గుణ లోక్‌సభ స్థానంలో పోటీ ఉత్కంఠ రేపుతోంది. గుణ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా బరిలో నిలిచారు. 2019లో అనూహ్యంగా ఓటమిపాలైన సింధియా, ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గుణా లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి, ఒకప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోవటం వల్ల జ్యోతిరాదిత్య ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి గుణ లోక్‌సభ స్థానంలో సింధియా రాజ కుటుంబం పట్టును చాటిచెప్పాలని జ్యోతిరాదిత్య పట్టుదలగా ఉన్నారు.
ఇదీ కుటుంబ నేపథ్యం
సింధియా కుటుంబం స్వాతంత్ర్యానికి పూర్వం గ్వాలియర్ రాజ్యాన్ని పరిపాలించింది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావ్ సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా వరుసగా గెలిచారు. 2001 సెప్టెంబర్ 30న ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మాధవ్‌రావ్ సింధియా చనిపోయారు. ఈ స్థానం నుంచి తొమ్మిదిసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన మాధవ్‌రావ్ సింధియా, 1971 నుంచి ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. జన్ సంఘ్ పార్టీ టికెట్ మీద కూడా ఆయన పోటీచేశారు.
జ్యోతిరాదిత్య సింధియా తల్లి కిరణ్ రాజ్య లక్ష్మీదేవి, కాస్కీ, లాంజంగ్ మహారాజు జుద్ధా షంషేర్ జంగ్ బహదూర్ రాణా మునిమనుమరాలు. గైక్వాడ్ మరాఠా సంస్థానానికి చెందిన ప్రియదర్శిని రాజే సింధియాతో జ్యోతిరాదిత్య వివాహం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా మేనత్తలు వసుంధర రాజే, యశోధర రాజే బీజేపీలో ఉన్నారు. వీరి తల్లి రాజమాత విజయరాజే సింధియా బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ కూడా బీజేపీ నేత.
రాజకీయ చరిత్ర
గ్వాలియర్ రాజ వంశస్థుల రాజకీయ ప్రయాణం కొంచెం విభిన్నంగా ఉంటుంది. గుణ పార్లమెంట్ స్థానం నుంచి రాజమాత విజయ రాజే సింధియా, 6 సార్లు, మాధవ్‌రావ్ సింధియా నాలుగు పర్యాయాలు గెలిచారు. జ్యోతిరాధిత్య సింధియా అమ్మమ్మ, రాజమాత విజయ రాజే సింధియా విజయ రాజే సింధియా 1957లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి మొదటి ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత ఆమె 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా, 1989లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా, 1971లో భారతీయ జన్ సంఘ్ టిక్కెట్‌పై గుణ నుంచి మొదటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సింధియా కుటుంబానికి కంచుకోటలా ఉన్న గుణ పార్లమెంట్ నియోజకవర్గంలో గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానంలో సత్తా చాటితే ఆ ప్రభావం ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఉంటుంది. రాజమాత సింధియా కుమార్తె యశోధర రాజే కూడా బీజేపీ తరపున గ్వాలియర్ స్థానం నించి లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
జ్యోతిరాదిత్య సింధియా ప్రయాణం
జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మరణానంతరం, 30 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. గుణ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసి, గెలిచారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మూడేళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో వరుసగా మూడోసారి పార్లమెంటుకు ఎన్నికై, వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2012లో విద్యుత్తు శాఖ సహాయ మంత్రి పదవి కూడా నిర్వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఆయన పరాజయం పాలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
2019లో జ్యోతిరాదిత్య సింధియా ఓటమి లోక్‌సభ ఎన్నికల్లో సింధియాలకు రెండో ఎదురుదెబ్బ. 1984లో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే భింద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో 18.80 లక్షల మంది ఓటర్లు ఉండగా, మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది.